టులాండ్ మాన్... క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో జీవించిన వ్యక్తి ఇతను. మరణించాక సహజంగా ఆయన మృతదేహం మమ్మీగా మారిపోయింది. డెన్మార్క్‌లోని జుట్ లాండ్ ద్వీపకల్పంలో సిల్క్ బోర్డు సమీపంలో 1950లో ఈ మమ్మీని కనుగొన్నారు పరిశోధకులు. అనుకోకుండా ఇది కొంతమంది పర్యాటకుల కంటపడింది. దాన్ని చూసి వారు కొన్ని రోజుల క్రితం ఎవరినో చంపి ఇక్కడ పడేశారని అనుకున్నారు. అంతగా ఆ మమ్మీ శిధిలమవ్వకుండా సురక్షితంగా ఉంది. పోలీసులు చూసి శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహం చూసి ఆశ్చర్యపడ్డారు.
రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిలో పరీక్షలు చేసిన శాస్త్రవేత్తలు అతను 2400 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిగా గుర్తించారు. అతను క్రీస్తుపూర్వం 450 నుంచి 380 సంవత్సరాల మధ్య జీవించి ఉండొచ్చని అంచనా వేశారు. మరణించినప్పుడు అతని వయసు దాదాపు నలభై ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు. ఆయన తలకి ఉన్నితో అల్లిన టోపీ ధరించి ఉన్నాడు. నడుము చుట్టూ బెల్టు ఉంది. శరీరం మొత్తం నగ్నంగా ఉంది. మెడకు మాత్రం జంతువుల చర్మంతో తయారు చేసిన ఒక ఉచ్చు లాంటిది ఉంది. అప్పట్లో దుస్తులు వేసుకునే వారు కాదు మనుషులు.
మమ్మీగా ఎలా?
మమ్మీగా మార్చాలంటే ఈజిప్షియన్లు చేసినట్టు కొన్ని ఏర్పాట్లు చేయాలి. అనేక రసాయనాలు పూయాలి. కానీ ఈ మనిషి మృతదేహం సహజంగానే మమ్మీగా మారింది. దీనికి కారణం అతను మరణించిన ప్రదేశంలో చల్లని వాతావరణం ఉండడం, ఆక్సిజన్ పెద్దగా లేకపోవడం అని చెబుతున్నారు. అలాగే మనుషుల శరీరంలోని మృదు కణజాలాల్లో ఉండే యాసిడ్ వల్ల కూడా ఇలా మమ్మీగా మారి ఉండొచ్చని వివరిస్తున్నారు. ఈ మమ్మీ పై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అతని చివరి భోజనాన్ని కనుక్కునేందుకు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
చివరగా ఏం తిన్నాడు?
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన కథనంలో ‘ది లాస్ట్ మీల్ ఆఫ్ టులాండ్ మాన్’ పేరుతో ఆ వివరాలను ప్రచురించారు. అతను మరణించడానికి 12 గంటల ముందు ఆహారాన్ని తిని ఉంటాడని అంచనా వేశారు. బార్లీ, చేపలు, అవిసె గింజలతో చేసిన జావలాంటి ఆహారాన్ని అతను తిన్నట్టు గుర్తించారు. అతని మరణం సాధారణమైనదా లేక అసాధారణమైనదా అని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు శాస్త్రవేత్తలు. అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు. ఈ మమ్మీని ప్రస్తుతం డెన్మార్క్ లోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు. దీన్ని చూసేందుకు పర్యాటకులు కూడా వస్తుంటారు.
Also read: మీ టాయిలెట్ సీట్ కంటే ఈ వాటర్ బాటిల్స్ పైనే 40 వేల రెట్ల ఎక్కువ బ్యాక్టీరియా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.