చాలామంది వాటర్ బాటిల్స్ కొన్న తర్వాత వాటిని తాగి పడేయకుండా తిరిగి వినియోగిస్తూ ఉంటారు. ఇలా పునర్వినియోగం చేసే ఈ వాటర్ బాటిల్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు హెచ్చరించాయి. అయినా సరే ఇంకా అలాంటి వాటర్ బాటిల్స్ ను వాడుతూనే ఉన్నారు. ఇలా మళ్లీ మళ్లీ ఉపయోగించే ఈ నీళ్ల బాటిల్ పై అధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుందని చెబుతుంది ఒక అధ్యయనం. ముఖ్యంగా మీ బాత్రూంలోని టాయిలెట్ సీట్ కంటే ఈ బాటిల్ పైనే 40,000 రెట్ల ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది ఆశ్చర్యంగా ఉన్నా కూడా, పూర్తి ఆధారాలతో నిరూపణ అయిన విషయం. 


ఈ వాటర్ బాటిల్స్ పై బాసిల్లస్ కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా కాలనీలుగా ఏర్పడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సూక్ష్మజీవుల వల్ల జీర్ణాశయంతర సమస్యలు కలిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు. వీటిలో వేసిన నీళ్లతో పాటు ఈ బాక్టీరియా కూడా పొట్టలోకి చేరుకొని, అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒక బాటిల్ పై నివసించే సూక్ష్మజీవుల యూనిట్ల సంఖ్యను లెక్కించేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. ఆశ్చర్యంగా కిచెన్ లోని సింకు, టాయిలెట్ సీట్ కన్నా ఈ రీయూజబుల్ వాటర్ బాటిల్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్టు కనుగొన్నారు.


కంప్యూటర్ మౌస్ పై కూడా బ్యాక్టీరియా చేరుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అయితే ఈ కంప్యూటర్ మౌస్ పై చేరే బ్యాక్టీరియా కన్నా ఈ వాటర్ బాటిల్ పై ఉండే బ్యాక్టీరియా సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. అలాగే ఇంట్లోని పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టే గిన్నెలు కూడా ఈ వాటర్ బాటిల్ కన్నా ఎంతో శుభ్రంగా ఉంటుందని వారు తెలిపారు. ఎందుకంటే పెట్ బౌల్ కన్నా ఈ వాటర్ బాటిల్స్ పైన చేరే బ్యాక్టీరియాల సంఖ్య 14 రెట్లు ఎక్కువ. అందుకే వాటర్ బాటిల్స్ వాడే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి.  ముఖ్యంగా స్టీల్ వాటర్ బాటిళ్లను కొనుక్కొని ఎప్పటికప్పుడు వాటిని ఉప్పు వేసి శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.


నిపుణులు చెబుతున్న ప్రకారం మీ వాటర్ బాటిల్‌ని రోజూ శుభ్రపరచుకోవాలని కనీసం వారానికి ఒకసారి ఉప్పు వంటి పదార్థాలను వేసి బ్రష్షులతో బాగా రుద్ది కడిగి, ఎండలో కనీసం రెండు గంటలసేపు ఉంచాలని చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు వాటర్ బాటిల్స్‌లో వేసిన నీళ్లను తాగకూడదని చెబుతున్నారు. 
ఎలాంటి కారణాలు లేకుండా తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటే ఒకసారి వాటర్ బాటిల్‌ను మార్చడం కూడా చాలా మంచిది. 




Also read: బ్లాక్ టీ రోజూ తాగే అలవాటు ఉందా? జాగ్రత్త, గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.