UPW-W vs RCB-W, Match Highlights: 


బెంగళూరు మురిసింది! తొలిసారి మనసారా నవ్వింది! వరుస ఓటముల భారాన్ని భుజాల మీద నుంచి దించుకుంది. తామూ గెలవగలమని నిరూపించుకుంది. విమెన్‌ ప్రీమియర్‌ లీగులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం తొలి విజయపు మాధుర్యాన్ని రుచిచూసింది. యూపీ వారియర్జ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఆ జట్టు నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. యువ క్రికెటర్‌ కనిక అహుజా (46; 30 బంతుల్లో 8x4, 1x6) తన కనికట్టు ప్రదర్శించింది. రిచా ఘోష్‌ (31*; 32 బంతుల్లో 3x4, 1x6), హీథర్‌ నైట్‌ (24; 21 బంతుల్లో 5x4) ఆకట్టుకున్నారు. అంతకు ముందు యూపీలో గ్రేస్‌ హ్యారిస్‌ (46; 32 బంతుల్లో 5x4, 2x6) టాప్‌ స్కోరర్‌. దీప్తి శర్మ (22; 19 బంతుల్లో 4x4), కిరణ్‌ నవగిరె (22; 26 బంతుల్లో 2x4, 1x6) ఆమెకు అండగా నిలిచారు.


మధ్యలో తడబడ్డా! 


మోస్తరు ఛేదనకు దిగిన బెంగళూరుకు సోఫీ డివైన్‌ (14; 6 బంతుల్లో) మెరుపు ఆరంభం అందించింది. తొలి ఓవర్లోనే 2 బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేసిన 14 పరుగులు సాధించింది. స్లాగ్‌స్వీప్‌తో భారీ షాట్‌ ఆడబోయి ఆఖరి బంతికి ఔటైంది. మరికాసేపటికే దీప్తి శర్మ వేసిన 1.3వ బంతిని స్వీప్‌ చేయబోయి కెప్టెన్‌ స్మృతి మంధాన (0) క్లీన్‌బౌల్డ్‌ అయింది. ఈ సిచ్యువేషన్లో ఎలిస్‌ పెర్రీ (10), హీథర్‌ నైట్‌ మూడో వికెట్‌కు 28 బంతుల్లో 29 పరుగుల భాగస్వామ్యం అందించారు. దూకుడు పెంచే టైమ్‌లోనే జట్టు స్కోరు 43 వద్ద పెర్రీని వైద్య బోల్తా కొట్టించింది. మళ్లీ వికెట్ల పతనం మొదలైందా? బెంగళూరుకు ఓటమి తప్పదా అన్న ఆందోళన పెరిగినవేళ కనిక అహుజా నిలిచింది. మొదట్లో ఆచితూచి ఆడింది. పరిస్థితులకు అలవాటు పడ్డాక వరుస బౌండరీలు బాదేసింది. రిచా ఘోష్‌తో కలిసి ఐదో వికెట్‌కు 46 బంతుల్లోనే 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో ఆర్సీబీ 12.6 ఓవర్లకు 100 పరుగుల మైలురాయికి చేరుకుంది. హాఫ్‌ సెంచరీ చేసే క్రమంలో కనిక జట్టు స్కోరు 120 వద్ద ఎకిల్‌స్టోన్‌ బౌలింగ్‌లో బౌల్డైంది. ఆ తర్వాత రిచా ఒక సిక్సర్, బౌండరీ బాదేసి జట్టుకు తొలి విజయం అందించింది.


'డివైన్‌' బౌలింగ్‌!


తాజా వికెట్‌ కావడంతో టాస్‌ గెలిచిన ఆర్సీబీ ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్‌కు దించింది. ప్రణాళిక మేరకు బౌలింగ్‌ చేసింది. తొలి ఓవర్లోనే సోఫీ డివైన్‌ తన పదునైన స్వింగ్‌ బౌలింగ్‌తో యూపీ వారియర్జ్‌ను దెబ్బకొట్టింది. రెండో బంతికి దేవికా వైద్య (0)ను గోల్డెన్‌ డక్‌ చేసింది. ఆఖరి బంతికి ప్రమాదకర అలీసా హీలీ (1)ను ఔట్‌ చేసింది. మరికాసేపటికే తాలియా మెక్‌గ్రాత్‌ (2)ను మేఘాన్‌ షూట్‌ పెవిలియన్‌ పంపింది. దీంతో 5 పరుగులకే యూపీ 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ సిచ్యువేషన్లో గ్రేస్‌ హ్యారిస్‌, కిరణ్‌ నవగిరె తమ జట్టును ఆదుకొన్నారు. ఆచితూచి ఆడుతూనే 26 బంతుల్లో 24 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే జట్టు స్కోరు 29 వద్ద కిరణ్‌ను ఆశా ఔట్‌ చేసి ఈ జోడీని విడదీసింది. మరో 2 పరుగులకే సిమ్రన్‌ షేక్‌ (2)నూ ఆమే ఔట్‌ చేసింది.


హ్యారిస్‌ మళ్లీ!


ఎనిమిది ఓవర్లకే 31/5తో కష్టాల్లో పడ్డ యూపీని గ్రేస్‌ హ్యారిస్‌ ఆదుకొంది. యువ బౌలర్లు వచ్చే వరకు ఓపికగా ఆడింది. ఆమెకు దీప్తి శర్మ అండగా నిలిచింది. వీరిద్దరూ శ్రేయాంక వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్‌, రెండు బౌండరీలు బాదేసి 15 పరుగులు సాధించారు. తర్వాత ఆశా వేసిన ఓవర్లో హ్యారిస్‌ రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేసి 16 పరుగులు రాబట్టింది. కేవలం 2 ఓవర్లలోనే 31 పరుగులు రావడంతో యూపీ స్కోరు వేగం పెరిగింది. వీరిద్దరూ 42 బంతుల్లోనే 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 14.5 ఓవర్లకు జట్టు స్కోరు 100కు చేరుకుంది. జోరు పెంచిన ఈ జోడీని ఒక పరుగు వ్యవధిలో ఎలిస్‌ పెర్రీ పెవిలియన్‌కు పంపించి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేసింది. ఆఖర్లో ఎకిల్‌ స్టోన్‌ (12), అంజలి శర్వాణి (8) కలిసి స్కోరును 135కు చేర్చారు.