UPW vs RCBW:
విమెన్ ప్రీమియర్ లీగులో నేడు 13వ మ్యాచ్ జరుగుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్జ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి స్మృతి మంధాన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ తాజాగా ఉందని ఆమె వెల్లడించింది. వీలైనంత మేరకు వికెట్‌ను ఉపయోగించుకుంటామని తెలిపింది. వరుస ఓటములు ఎదురవుతున్నా అభిమానులు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసింది. వారిని ఆనందంలో ముంచెత్తేందుకు ప్రయత్నిస్తామంది. కనిక ఫిట్‌గా ఉందని జట్టులోకి తీసుకున్నామని పేర్కొంది.
'మేమూ మొదట బౌలింగే ఎంచుకోవాలని అనుకున్నాం. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడి మంచి స్కోర్ చేసేందుకు ఇదో చక్కని అవకాశం. గ్రేస్ హ్యారిస్ ఫిట్‌గా ఉంది. షబ్నిమ్ ఇస్మాయిల్ స్థానంలో ఆమెను తీసుకున్నాం. ఆర్సీబీకి పటిష్ఠమైన బ్యాటింగ్ లైనఫ్ ఉంది. వారు గట్టి పోటీనిస్తారు. మేం ఆడుతున్న విధానానికి గర్వంగా ఉంది' అని యూపీ వారియర్జ్ కెప్టెన్ అలీసా హీలీ వెల్లడించింది.
పిచ్ ఎలా ఉందంటే?
డీవై పాటిల్ పిచ్ నెమ్మదిస్తోంది. పచ్చిక ఉండటంతో బౌలర్లు ప్రభావం చూపించగలరు. తొలుత పేసర్లు తర్వాత స్పిన్నర్లకు సహకరిస్తుంది. బౌండరీలు చిన్నవిగానే ఉంటాయి. నిలబడితే బ్యాటర్లు పరుగులు చేయగలరు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేఘన్ షూట్, రేణుకా సింగ్, ఆశా శోభన, కనిక అహుజా
యూపీ వారియర్జ్: దేవికా వైద్య, అలీసా హీలీ, కిరన్ నవగిరె, గ్రేస్ హ్యారిస్, తాలియా మెక్‌గ్రాత్, సిమ్రన్ షేక్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, శ్వేతా షెరావత్, అంజలి శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్
ఆర్సీబీ గెలిచేనా?
ఎంత ప్రయత్నించినా! ఏం చేసినా! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్క విజయమైనా సాధించలేకపోతోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై నిరాశలో కూరుకుపోయింది. దాంతో కనీసం ఒక్కటైనా గెలుస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒత్తిడిలో పరుగులు చేయలేకపోతోంది. సోఫీ డివైన్ ఫర్వాలేదు. ఎలిస్ పెర్రీ మిడిలార్డర్లో ఒంటరి పోరాటాలు చేస్తోంది. రిచా ఘోష్ ఫామ్‌లోకి రావడం శుభసూచకం. వీరిద్దరూ డీసీపై 34 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. హీథర్ నైట్, శ్రేయాంక పాటిల్ ఫర్వాలేదు. బౌలింగ్‌లో హేమాహేమీలున్నా పరుగుల్ని నియంత్రించడం లేదు. వికెట్లు పడగొట్టడం లేదు. 15 ఓవర్ల వరకు కట్టడి చేసినా డెత్ ఓవర్లలో తేలిపోతున్నారు. స్పిన్ డిపార్ట్‌మెంట్ మరింత బలపడాలి.