WPL 2023, UPW-W vs RCB-W:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో నేడు 13వ మ్యాచ్‌ జరుగుతోంది. డీవై పాటిల్‌ వేదికగా యూపీ వారియర్జ్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (UPW vs RCBW) తలపడుతున్నాయి. నాలుగు పాయింట్లతో కొనసాగుతున్న యూపీ మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. కనీసం ఇప్పటికైనా విజయ ఢంకా మోగించాలని ఆర్సీబీ ఎదురు చూస్తోంది. మరి ఈ పోరాటంలో గెలుపు ఎవరిని వరించనుంది? తుది జట్లలో ఎవరుంటారు?


బోణీ కొట్టని ఆర్సీబీ


ఎంత ప్రయత్నించినా! ఏం చేసినా! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్క విజయమైనా సాధించలేకపోతోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై నిరాశలో కూరుకుపోయింది. దాంతో కనీసం ఒక్కటైనా గెలుస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒత్తిడిలో పరుగులు చేయలేకపోతోంది. సోఫీ డివైన్‌ ఫర్వాలేదు. ఎలిస్‌ పెర్రీ మిడిలార్డర్లో ఒంటరి పోరాటాలు చేస్తోంది. రిచా ఘోష్‌ ఫామ్‌లోకి రావడం శుభసూచకం. వీరిద్దరూ డీసీపై 34 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. హీథర్‌ నైట్‌, శ్రేయాంక పాటిల్‌ ఫర్వాలేదు. బౌలింగ్‌లో హేమాహేమీలున్నా పరుగుల్ని నియంత్రించడం లేదు. వికెట్లు పడగొట్టడం లేదు. 15 ఓవర్ల వరకు కట్టడి చేసినా డెత్‌ ఓవర్లలో తేలిపోతున్నారు. స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌ మరింత బలపడాలి.


యూపీ ఫర్లేదు!


ఒక గెలుపు. వెంటనే మరో ఓటమి. విమెన్‌ ప్రీమియర్ లీగులో గుజరాత్‌ వారియర్జ్‌ (UP Warriorz) ఆటతీరిది. నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. లోపాలను సవరించుకుంటూ నానాటికీ బలపడుతోంది. కెప్టెన్‌ అలీసా హేలీ (Alyssa Healy) ఫామ్‌లోకి వచ్చింది. లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌ కోసం దేవికా వైద్యను ఓపెనింగ్‌కు పంపిస్తున్నారు. కిరణ్‌ నవగిరరె, తాలియా మెక్‌గ్రాత్‌ నిలిస్తే పరుగుల వరద పారించగలరు. మిడిలార్డర్లో సోఫీ ఎకిల్‌స్టోన్‌, దీప్తి శర్మ, శ్వేతా షెరావత్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ రాణించాల్సి ఉంది. ఎకిల్‌స్టోన్‌, దీప్తి, రాజేశ్వరీ గైక్వాడ్‌ రూపంలో స్పిన్‌ త్రయం ఉండటం యూపీ బలం. పేస్‌ విభాగంలో కాస్త బలహీనత కనిపిస్తోంది. గ్రేస్‌ హ్యారిస్‌, అంజలీ శర్వాణిపై ఎక్కువ ఆధారపడుతున్నారు.


పిచ్‌ ఎలా ఉందంటే?


డీవై పాటిల్‌ పిచ్‌ నెమ్మదిస్తోంది. పచ్చిక ఉండటంతో బౌలర్లు ప్రభావం చూపించగలరు. తొలుత పేసర్లు తర్వాత స్పిన్నర్లకు సహకరిస్తుంది. బౌండరీలు చిన్నవిగానే ఉంటాయి. నిలబడితే బ్యాటర్లు పరుగులు చేయగలరు.


తుది జట్లు (అంచనా)


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్‌, దిశా కసత్‌, మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, ఆశా శోభన, ప్రీతీ బోస్‌


యూపీ వారియర్జ్‌: దేవికా వైద్య, అలీసా హీలీ, కిరన్‌ నవగిరె, తాలియా మెక్‌గ్రాత్‌, శ్వేతా షెరావత్‌, దీప్తి శర్మ, సిమ్రన్‌ షేక్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ / గ్రేస్‌ హ్యారిస్‌, అంజలి శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్‌