Aakash Chopra On WTC Finals: 


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను (WTC Final) ఇంగ్లాండ్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశ్నించాడు. రెండేళ్లు జరిగే ఛాంపియన్‌షిప్‌లో విజేతను ఒక మ్యాచ్‌ ద్వారా తేల్చడం అసంబద్ధంగా ఉందన్నాడు. కనీసం మూడు టెస్టుల సిరీసు నిర్వహించాలని సూచించాడు. ఈ మేరకు అతడు వరుస ట్వీట్లు చేశాడు.


నాలుగేళ్ల క్రితం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలను ప్రవేశపెట్టింది. మొదటి సైకిల్లో న్యూజిలాండ్‌, టీమ్‌ఇండియా ఫైనల్‌ ఆడాయి. అరంగేట్రం ఫైనల్‌కు లార్డ్స్‌ను వేదికగా నిర్ణయించారు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌కు మర్చారు. ఇందులో కివీస్‌ విజేతగా ఆవిర్భవించింది. రెండో సైకిల్లోనూ ఫైనల్‌కు లండన్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తోంది. చాలా మందికి ఇది నచ్చడం లేదు. అక్కడే ఎందుకు నిర్వహించాలని, దాని వెనక లాజిక్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఫైనల్‌ పోటీలను బెస్ట్‌ ఆఫ్ త్రి ఫార్మాట్లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.




'ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనళ్లు ఇంగ్లాండ్‌లోనే ఎందుకు జరుగుతాయి? తటస్థ వేదికని మీరు చెప్పొచ్చు. కానీ ఆసియా ఏతర దేశాల పరిస్థితులను ఇక్కడి వేదికలు ప్రతిబింబిస్తాయి. పైగా ఒక్కటే మ్యాచ్‌ ఎందుకు నిర్వహించాలి? ప్రపంచ ఛాంపియన్‌ ఎవరో తేల్చేందుకు టెస్టు సిరీస్‌ ఎందుకు పెట్టొద్దు? ఫైనల్‌ ఆడే దేశాల్లో ఒక్కో మ్యాచ్‌, తటస్థ వేదికలో ఒక మ్యాచ్‌ ఎందుకు పెట్టకూడదు' అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.


'విజేతను తేల్చేందుకు ఎక్కడా రెండేళ్ల పాటు టోర్నీలు ఉండవు. అందుకే నా వరకైతే ఒక్క మ్యాచునే ఫైనల్‌ అనొద్దు. టెస్టు క్రికెట్‌ ప్రత్యేకమైంది. ఐదు రోజులు జరుగుతుంది. ఛాంపియన్‌షిప్‌ రెండేళ్లు ఉంటుంది. అందుకే ఫైనల్‌ను కచ్చితంగా మూడు మ్యాచుల సిరీస్‌గా నిర్వహించాలి' అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు.


ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా (IND vs AUS)  చేరుకున్నాయి. జూన్ 7న లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ఫైనల్‌ ఆడుతున్నాయి. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టు గెలవడంతో ఆసీస్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్‌ చేతిలో లంకేయులు ఓటమి చవిచూడటంతో, రెండో స్థానంలోని టీమ్‌ఇండియా తుది పోరుకు దూసుకెళ్లింది. కాగా 2-1తో రోహిత్‌సేన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.