MI-W vs GG-W Highlights:


విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ముంబయి ఇండియన్స్‌కు ఎదురు లేదు! వారిని కట్టడి చేసే ప్రత్యర్థి కనిపించడమే లేదు! లీగులో హర్మన్‌ సేన వరుసగా ఐదో విజయం అందుకొంది. తన అజేయ పరాక్రమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌ను ఏకంగా 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన జెయింట్స్‌ను 107/9కి పరిమితం చేసింది. హర్లీన్‌ డియోల్‌ (22; 23 బంతుల్లో 3x4), స్నేహ రాణా (20; 19 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లంటేనే ముంబయి బౌలర్ల ప్రతాపం అర్థం చేసుకోవచ్చు. నాట్‌ సివర్‌, హేలీ మాథ్యూస్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (51; 30 బంతుల్లో 7x4, 2x6), యస్తికా భాటియా (44; 37 బంతుల్లో 5x4, 1x6) మెరుపులతో ఎంఐ మంచి స్కోరు చేసింది.


వామ్మో సివర్‌!


ముందున్నది మోస్తరు టార్గెట్టే! పైగా గాల్లో తేమ ఉంది! అయినా సరే గుజరాత్‌ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే సోఫియా డంక్లీని నాట్‌ సివర్‌  వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. ఈ క్రమంలో మేఘన (16), హర్లీన్‌ డియోల్‌ నిలకడగా ఆడారు. రెండో వికెట్‌ 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిలదొక్కుకుంటున్న ఈ జోడీని మేఘనను ఔట్‌ చేయడం ద్వారా హేలీ మాథ్యూస్‌ విడదీసింది. ఇదే స్కోరు వద్ద సుథర్ ల్యాండ్‌ (0)నూ ఆమే ఔట్‌ చేసింది. జట్టు స్కోరు 48 వద్ద హర్లీన్‌ను వాంగ్‌, ఆస్లే గార్డ్‌నర్‌ (8)ను కెర్‌ పెవిలియన్‌ పంపించడంతో గుజరాత్‌ కథ దాదాపుగా ముగిసింది. హేమలత (6) ఎక్కువ సేపు నిలవలేదు. మధ్యలో సుష్మా వర్మ (18 నాటౌట్‌) సాయంతో కెప్టెన్‌ స్నేహరాణా కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకొంది. జట్టు స్కోరు 85 వద్ద ఆమెను, 95 వద్ద కిమ్‌ గార్త్‌ (8)ను సివర్‌ బ్రంట్‌ ఔట్‌ చేసి గుజరాత్‌ ఓటమిని ఖరారు చేసేసింది. మానసి జోషి (7*) ఆట లాంఛనమే! 



టాప్‌ ఆర్డర్‌ ఫర్లేదు


సీసీఐ మైదానంలో జరుగుతున్న ఈ పోరులో గుజరాత్‌ టాస్‌ గెలిచి వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకొంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్‌ చేసింది. ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఒక పరుగు వద్దే హేలీ మాథ్యూస్‌ (0) యాష్లే గార్డ్‌నర్‌ ఔట్‌ చేసింది. దాంతో మరో ఓపెనర్‌ యస్తికా భాటియా, నాట్‌ సివర్‌ (36; 31 బంతుల్లో 5x4, 1x6) ఆచితూచి ఆడారు. మూడు ఓవర్ల తర్వాతే పెద్ద షాట్లకు దిగారు. పవర్‌ ప్లే ముగిసే సరికి ముంబయిని 40/1తో నిలిపారు. డేంజరస్‌గా మారుతున్న ఈ జోడీని 10.6వ బంతికి సివర్‌ను ఔట్‌ చేయడం ద్వారా గార్త్‌ విడదీసింది. రెండో వికెట్‌కు 74(62 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యానికి తెరదించింది. మరికాసేపటికే యస్తికా రనౌటైంది.


హర్మన్‌ మెరుపు 50


ఇబ్బందుల్లో పడ్డ ముంబయిని కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ ఆదుకొంది. అమెలియా కెర్‌ (19) సాయంతో 29 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దూకుడు పెంచిన కెర్‌ను జట్టు స్కోరు 135 వద్ద కన్వర్‌ ఔట్‌ చేసి గుజరాత్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ఇస్సీ వాంగ్‌ (0), హమైరా కాజి (2) ఎక్కువసేపు నిలవలేదు. అయినప్పటికీ హర్మన్‌ పట్టు వదల్లేదు. 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకొంది. 19వ ఓవర్లో 2 సిక్సర్లు, 20వ ఓవర్లో 2 బౌండరీలు బాదేసి స్కోరును 150 దాటించేసింది. ఆ తర్వాత ఆమె ఔటవ్వడంతో ముంబయి 162కు పరిమితమైంది.