WTC 2023 Standings: బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించటంతో.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను భారత్ మెరుగుపరచుకుంది. బంగ్లాపై గెలుపుతో స్టాండింగ్స్ లో టీమిండియా తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం 58.92 పాయింట్ల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ విజయం భారత్ ఫైనల్ అవకాశాలను నిర్ణయించనుంది.
బంగ్లాతో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్య ఛేదనలో 71కే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను శ్రేయస్ అయ్యర్ (29), రవిచంద్రన్ అశ్విన్ (42) ఆదుకున్నారు. వారిద్దరూ 8వ వికెట్ కు అజేయంగా 71 పరుగులు జోడించి విజయాన్ని అందించారు.
దీంతో రెండు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ ను క్వీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ లో తన పాయింట్ల శాతాన్ని పెంచుకుంది.
ఫైనల్ లో స్థానం కోసం దక్షిణాఫ్రికాతో పోటీ
2023 మార్చితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021- 2023 ఎడిషన్ ముగుస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికాలు టాప్- 3 స్థానాల్లో ఉన్నాయి. 76.92 పాయింట్ల శాతంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఖాయమే. ఇకపోతే రెండో స్థానం కోసం టీమిండియా, దక్షిణాఫ్రికాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ప్రస్తుతం భారత్ 58.92 శాతంలో రెండో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా 55.76 శాతంలో మూడో స్థానంలో ఉంది.
త్వరలో భారత్, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ఈ ఆసీస్ ను 4-0 తేడాతో ఓడిస్తే 68.05 విజయ శాతం లభిస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికాకు మిగిలిన 4 టెస్టులను గెలిచినా కూడా కేవలం 66.66 శాతమే ఉంటుంది. ఫైనల్స్‌కు అవకాశం రాదు. ఇక భారత్ 3-0తో సిరీస్‌ను సాధిస్తే మాత్రం 64.35 పాయింట్లకు చేరుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా తన 4 టెస్టుల్లో విజయం సాధిస్తేనే ఫైనల్ లో అడుగుపెడుతుంది. ఇక మిగిలిన జట్లకు ఫైనల్స్‌కు చేరేందుకు మార్గాలు దాదాపు మూసుకుపోయాయి.