World Cup Record: మరికొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ 13వ సీజన్ భారత్ లో జరగబోతోంది. ఇప్పటి వరకు భారత జట్టు 12 వన్డే ప్రపంచకప్ లలో పాల్గొంది. ఈ మహాసంగ్రామంలో పాకిస్థాన్ జట్టు ఎప్పుడూ భారత్ పై గెలవలేదు. వన్డే ప్రపంచకప్ లో భారత్, పాకిస్థాన్ లు మొత్తం 7 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ప్రతి మ్యాచ్ లోనూ పాకిస్థాన్ ను భారత్ ఓడించింది. పాకిస్థాన్ తో పాటు ప్రపంచకప్ లో ఇప్పటి వరకు ఈ జట్లు ఏవీ భారత జట్టును ఓడించలేకపోయాయి.


పాకిస్థాన్ తో పాటు కెన్యా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ, నమీబియా, ఆప్ఘనిస్థాన్, బెర్ముడా, తూర్పు ఆఫ్రికా జట్లు ప్రపంచకప్ లో భారత్ ను ఓడించలేకపోయాయి. ప్రపంచకప్ లో మొత్తం 9 జట్లు భారత్ ను ఓడించలేకపోయాయి. భారత్ - కెన్యా మధ్య మొత్తం నాలుగు వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగాయి. వాటిలో అన్నింట్లో భారత జట్టే విజయం సాధించింది. యూఏఈ, నమీబియా, ఆప్ఘనిస్థాన్, బెర్ముడా, తూర్పు ఆఫ్రికా జట్లు వన్డే ప్రపంచకప్ లో భారత్ తో ఒక్కో సారి తలపడినప్పటికీ ఏ జట్టు కూడా విజయాన్ని సాధించలేదు. 


వన్డే ప్రపంచకప్ లో భారత్ ను ఓడించలేని జట్లు



  • భారత్ vs పాకిస్థాన్: 7 మ్యాచ్ లు - భారతే అన్నీ గెలిచింది

  • భారత్ vs కెన్యా : 4 మ్యాచ్‌లు - భారతే అన్నీ గెలిచింది

  • భారత్ vs ఐర్లాండ్ : 2 మ్యాచ్‌లు - భారతే అన్నీ గెలిచింది

  • భారత్ vs నెదర్లాండ్స్ : 2 మ్యాచ్‌లు - భారతే అన్నీ గెలిచింది

  • భారత్ vs యూఏఈ : 1 మ్యాచ్ - భారతే గెలిచింది

  • భారత్ vs నమీబియా : 1 మ్యాచ్ - భారతే గెలిచింది

  • భారత్ vs ఆప్ఘనిస్థాన్ : 1 మ్యాచ్ - భారతే గెలిచింది

  • భారత్ vs బెర్ముడా : 1 మ్యాచ్ - భారతే గెలిచింది

  • భారత్ vs తూర్పు ఆఫ్రికా : 1 మ్యాచ్ - భారతే గెలిచింది


వన్డే ప్రపంచకప్ లో భారత్ - పాకిస్థాన్ ల మధ్య అత్యధికంగా 7 మ్యాచ్ లు జరగడం గమనార్హం. 1992 మార్చి 4న ఈ రెండు జట్ల మధ్య తొలి ప్రపంచకప్ పోరు జరిగింది. 2019 ప్రపంచకప్ లో భారత్, పాక్ తమ చివరి వన్డే ప్రపంచకప్ మ్యాచ్ ఆడాయి. 2023 వన్డే ప్రపంచకప్ లో ఈ దాయాది జట్లు అక్టోబర్ 14వ తేదీన ముఖాముఖి తలపడనున్నాయి.


టీమ్ఇండియా వరల్డ్ కప్‌ జట్టులో మార్పులు


ఆల్ రౌండర్ అక్షర్‌ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో వేరే ఆలోచన లేకుండా గాయం కారణంగా జట్టుకు దూరమైన అక్షర్ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చారు. 


ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో అశ్విన్ 22 సగటుతో 4 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా చాలా కాలం తర్వాత అశ్విన్ వన్డేల్లో పునరాగమనం చేశాడు. 21 జనవరి 2022న అశ్విన్ భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చి ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేసిన అశ్విన్‌ ఇప్పుడు మెగా ఈవెంట్  ఆడే భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 115 వన్డేలు ఆడాడు.