BCCI on WC 2023 Venues: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. అతిపెద్ద క్రికెట్ కార్నివాల్ దేశంలో జరుగుతుండటంతో భారత్‌లోని పది నగరాలలో గల వేదికలు ఇందుకు ముస్తాబవుతున్నాయి. అయితే మ్యాచ్‌లు దక్కిన వాళ్లు సంతోషంగా ఉంటే దక్కనివాళ్లు మాత్రం తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్ వరకే ఇది పరిమితం కాలేదు. వేదికలకు రాజకీయ రంగు కూడా అంటుకుంది. బీజేపీ అనుకూల రాష్ట్రాలకే ఎక్కువ మ్యాచ్‌లు, అధిక ప్రాధాన్యత కలిగిన మ్యాచ్‌లను ఇచ్చారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి.
ఈసారి వన్డే వరల్డ్ కప్ వేదికలుగా అహ్మదాబాద్, ముంబై, పూణె, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, ఢిల్లీ, ధర్మశాల, కోల్‌కతా ఎంపికయ్యాయి. తిరువనంతపురం (కేరళ), గువహతి (అసోం)లలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే వన్డే వరల్డ్ కప్‌లో తమకు కూడా మ్యాచ్‌లు దక్కుతాయని ఇండోర్ (మధ్యప్రదేశ్), మొహాలీ (పంజాబ్) భావించినా వాటికి ఐసీసీ, బీసీసీఐ మొండిచేయి చూపించాయి.
అప్పుడు ఇచ్చారు కదా..
ఇండోర్‌లో వరల్డ్ కప్ మ్యాచ్ లేకపోవడంపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిలాష్ ఖండేకర్ స్పందిస్తూ.. ‘1987లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇక్కడ (ఇండోర్) ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియానికి ఘన చరిత్ర ఉంది. ఈసారి కూడా మేం ఇండోర్‌లో మ్యాచ్ లు ఉంటాయని ఆశించాం. కానీ మాకు నిరాశే మిగిలింది’అని కామెంట్ చేశాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి కూడా ‘కేవలం మెట్రో నగరాలు, బీసీసీఐ, బీజీపీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే వేదికలు దక్కాయి. మాకు మొహాలీలో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం బాధాకరం. కనీసం మాకు ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఇవ్వలేదు...’ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజకీయ రంగు..
మొహాలీలో మ్యాచ్ లేకపోవడంపై పంజాబ్ క్రీడా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ స్పందిస్తూ.. రాజకీయ జోక్యం వల్లే బీసీసీఐ మొహాలీలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర వేదికలకు తరలించిందని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాట్లాడుతూ.. ‘వన్డే ప్రపంచకప్ చాలా పెద్ద టోర్నమెంట్. దేశవ్యాప్తంగా దానిని అన్ని ప్రాంతా ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఆనందించేలా మరికొంత కసరత్తు చేస్తే బాగుండేది. తిరువనంతపురంతో పాటు మొహాలీ, రాంచీ (జార్ఖండ్)లలో కూడా మ్యాచ్‌లను నిర్వహించాల్సింది. ఒకేచోట నాలుగైదు మ్యాచ్‌లు ఎందుకు..? బీసీసీఐ చేసిన తప్పు ఇదే’అని ఆరోపించారు.
అలాగే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాడు. ‘ఐపీఎల్ ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు అన్నీ అహ్మదాబాద్‌లోనే.. బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాడు..’అని ట్వీట్ చేశాడు.
బీసీసీఐ క్లారిటీ..
వేదికల వివాదం చినికి చినికి గాలి వాన అవకముందే బీసీసీఐ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పంజాబ్ క్రీడా మంత్రి చేసిన ఆరోపణలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్‌కు మేం 12 వేదికలను ఎంపిక చేశాం. గువహతి, తిరువనంతపురాల్లో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఉంటాయి. మిగిలిన పది చోట్ల లీగ్, నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లను కేటాయించడంలో ఏ స్టేడియంపైనా వివక్ష చూపలేదు. మొహాలీలో ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశమిచ్చాం. విరాట్ కోహ్ల వందో టెస్టు కూడా అక్కడే జరిగింది. కానీ ప్రస్తుతం మొహాలీలోని మల్లాన్‌పూర్ స్టేడియం పునర్నిర్మాణ దశలో ఉంది. ఈ స్టేడియం ఐసీసీ ప్రమాణాలను అందుకోలేదు. అందుకే వరల్డ్ కప్ వేదికల నుంచి దానిని తప్పించాం. ఇది పూర్తిగా ఐసీసీ నిర్ణయం’అని తెలిపాడు.
ఇక శశి థరూర్ వ్యాఖ్యలకు కూడా బీసీసీఐ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘సౌత్ జోన్‌లోని ప్రతి గ్రౌండ్‌లో మేం మ్యాచ్‌లను నిర్వహించలేం. సౌత్ జోన్‌లో ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు అవకాశమిచ్చాం. ఒకవేళ కేరళలో మ్యాచ్ జరగాలని శశి థరూర్ భావిస్తే ముందు తిరువనంతపురం స్టేడియాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ఎస్ఎఫ్) పరిధి నుంచి తప్పించి రాష్ట్ర క్రికెట్ సంఘంలోకి తీసుకొచ్చే కృషి చేయమనండి. ఇతర దేశాల్లో అయితే ఆరేడు ప్రతిష్టాత్మక వేదికలలోనే మ్యాచ్‌లను జరుపుతారు. కానీ భారత్ పెద్ద దేశం కాబట్టి వేదికలను పెంచాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ సంతోషపరచడం కుదరని పని..’అని బోర్డు వర్గాలు కాస్త ఘాటుగానే స్పందించాయి.