Teja Nidamanuru: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ - 2023లో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి జరుగబోయే మెగా టోర్నీకి ముందు జింబాబ్వేలో నిర్వహిస్తున్న క్వాలిఫయర్ పోటీలలో ఇటీవలే వెస్టిండీస్ - నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్ ద్వారా తేలిన ఈ మ్యాచ్ ఫలితం ఓ చరిత్ర. వెస్టిండీస్ నిలిపిన 375 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ డ్రా చేయగలిగిందంటే దానికి కారణం తేజ నిడమనూరు. భారీ లక్ష్య ఛేదనలో డచ్ టీమ్ 29 ఓవర్లలో 170-4 వద్ద ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన తేజ.. 76 బంతుల్లోనే 11 బౌండరీలు, 3 భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను నెదర్లాండ్స్ వైపునకు తిప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఈ విజయవాడ కుర్రాడి గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పుట్టి పెరిగింది ఇక్కడే...
అనిల్ తేజ నిడమమనూరు (అతడి పూర్తి పేరు) పుట్టింది ఆంధ్రాలోని విజయవాడలోనే.. చిన్నప్పుడే తేజ తల్లి (పద్మావతి) పై చదువుల నిమిత్తం సింగపూర్‌కు వెళ్లగా తేజ.. విజయవాడలోని తాతయ్య వాళ్లింట్లోనే పెరిగాడు. ఒకనాడు తేజ తాత (పిచ్చయ్య శాస్త్రి) అతడికి బ్యాట్ ఇచ్చి క్రికెట్ ఆడమన్నాడట. అప్పట్నుంచి తేజకు క్రికెట్ మీద ఆసక్తి మొదలైంది. ఆట మీద అతడికి ఫస్ట్ ఇంప్రెషన్ పడింది కూడా అప్పుడే.
ఆరేండ్లకు ఆక్లాండ్‌కు..
చదువు ముగిసిన తర్వాత పద్మావతికి ఆక్లాండ్ (న్యూజిలాండ్)లో ఉద్యోగం వచ్చింది. దీంతో తేజ మకాం కివీస్‌కు మారింది. అది అతడి క్రికెట్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో పద్మావతి చేసే ఉద్యోగం తాలూకు ఆఫీసు.. కార్న్‌వాల్ క్రికెట్ క్లబ్‌కు పక్కనే ఉండేది. అప్పటికే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న తేజకు అక్కడ పెద్ద పెద్ద న్యూజిలాండ్ క్రికెటర్ల ఆట చూసి ఇదే తన కెరీర్‌ను అని నిశ్చయించుకున్నాడు. అక్కడే ఓ చిన్న క్రికెట్ అకాడమీలో చేరి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సీనియర్ లెవల్‌లో 2018 లో ఎంట్రీ ఇచ్చిన తేజ.. ఆక్లాండ్ తరఫున పలు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కూడా ఆడాడు. జాతీయ జట్టులో అవకాశాల కోసం తీవ్రంగా కృషి చేశాడు. న్యూజిలాండ్ లో శీతాకాలం అయితే ఇంగ్లాండ్‌లో ఎండాకాలం ఉంటుందని.. వింటర్‌లో కివీస్‌లో మ్యాచ్‌లు ఏం జరుగకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీలలో ఆడేవాడు. అలా ఏడాదంతా క్రికెట్.. క్రికెట్.. క్రికెట్..
2019 లో కీలక నిర్ణయం..
న్యూజిలాండ్ జాతీయ జట్టులో తీవ్ర పోటీ ఉందని తెలుసుకున్న తేజ 2019 లో నెదర్లాండ్స్ కు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లినా ఆరు నెలల పాటు అవకాశాలు రాలేదు. అవి అసోసియేట్ దేశాలు గనక ఎప్పుడోగానీ వాటికి సిరీస్ లు ఉండేవి కావు. దీంతో తేజ.. కొన్నాళ్లు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. ఎట్టకేలకు అన్నీ వదిలి నెదర్లాండ్స్ టీమ్ లో చోటు దక్కించుకుని గతేడాది మే 31న వెస్టిండీస్ తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ స్థాయిలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో డచ్ టీమ్ ఓడినా తేజ మాత్రం హాఫ్ సెంచరీ (58) తో రాణించాడు. ఇప్పటివరకు నెదర్లాండ్స్ తరఫున 11 వన్డేలు, ఆరు టీ20లు ఆడిన తేజకు వెస్టిండీస్ తో క్వాలిఫయర్ మ్యాచ్ ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
వాళ్లు చాలా సపోర్టివ్..
నెదర్లాండ్స్ టీమ్ తనకు ఎలా సపోర్ట్ చేసిందన్నదానిపై తేజ స్పందిస్తూ.. ‘టీమ్ మేనేజ్మెంట్ చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. వాళ్లకు నేను ఎలా కష్టపడతాను..? ఏం చేస్తే ఇక్కడిదాకా వచ్చాను అన్నది తె లుసు. నెదర్లాండ్ కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్.. మరీ ముఖ్యంగా హెడ్ కోచ్ ర్యాన్ కుక్ చాలా మద్దతుగా ఉంటాడు. పర్సనల్‌గా నా ఆట గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు..’అని తెలిపాడు.