Ashes 2023 2nd Test: క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా తొలి రోజు ఒక్క ఓవర్ పడగానే స్టేడియం నుంచి పలువురు ఆందోళనకారులు సెక్యూరిటీ కళ్లు గప్పి ఒక్క ఉదుటున ప్రధాన పిచ్ వద్దకు దూసుకొచ్చారు. చేతిలో ఆరెంజ్ కలర్ పొడిని ఎగచల్లుతూ ఆటకు అంతరాయం కలిగించారు. వీరిలో ఒకరిని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. అమాంతం చంకలో ఎత్తుకుని ప్రధాన పిచ్ నుంచి బౌండరీ లైన్ వరకు తీసుకెళ్లి అక్కడ దింపిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. అసలు ఎవరు వీళ్లు..? ఎందుకలా చేశారు..? హై ప్రొఫైల్ గేమ్స్‌ను గత కొంతకాలంగా ఎందుకు టార్గెట్ చేశారు.
ఎవరు వీళ్లు..?
లార్డ్స్‌లో ఆటకు అంతరాయం కలిగించింది ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ (Just Stop Oil) గ్రూపునకు సంబంధించిన కార్యకర్తలు. ఇది ఒక పర్యావరణ పరిరక్షణ గ్రూపు. 2022లో బ్రిటన్‌లో అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న పర్యావరణ వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఆన్‌లైన్ పిటిషన్ (సంతకాల సేకరణ వంటిది) ద్వారా ఏర్పాటైన ఓ సంస్థ. బ్రిటన్ లో ఇంధన సేకరణ, కొత్త ఆయిల్ బావులకు అనుమతిలివ్వడం వంటివి మానుకోవాలని, దాని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందంటూ ఆరోపిస్తూ దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం 2025 నాటికి వంద కొత్త ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నానాటికీ వాళ్ల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు.
ఏం చేస్తారు..?
హింసకు తావివ్వకుండా నిరసనను వ్యక్తం చేయడం వీళ్ల ఆందోళనలలో భాగం. సాధారణంగా రోడ్లను బ్లాక్ చేయడం, మార్చ్‌లు తీయడం, వామనాలను అడ్డుకోవడం వంటి రొటీన్ నిరసనలతో పాటు మీడియా కంట పడే నిరసనలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటలే వీరి టార్గెట్. అందరూ మ్యాచ్‌లో మునిగిఉండగా ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అని రాసి ఉన్న పలువురు నిరసనకారులు సెక్యూరిటీ కళ్లుగప్పి ఫీల్డ్ లోకి వస్తారు. వెంట తెచ్చుకున్న కాషాయ పొడిని అక్కడ చల్లడం, టమాటో సాస్‌ను అక్కడ పడేసి, పర్యావరణ హితానికి మద్దతుగా నినాదాలు చేస్తూ చేయాల్సిన హంగామా చేశాక ఆ ప్లేస్‌ను వీడుతారు.
ఏమైనా చేశారా..?
2022లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ మూమెంట్‌కు సపోర్ట్‌గా నిలిచిన ఓ యువతి మ్యాచ్ జరుగుతుండగా లోపలికి దూసుకొచ్చింది. ఆమె నేరుగా గోల్‌పోస్ట్ దగ్గరకు వెళ్లి ఒక ప్లాస్టిక్ వైర్‌తో తన తలకు కట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. అప్పట్లో ఇది సంచలనమైంది. ఇది ముగిసిన కొద్దిరోజులకే ఇదే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మరో వ్యక్తి గోల్ పోస్ట్‌కు తన చేతులను కట్టేసుకున్నాడు. గతేడాది జరిగిన వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో ఆట మధ్యలో దూసుకొచ్చిన ఓ నిరసనకారుడు అక్కడ స్నూకర్ టేబుల్ మీద ఆరెంజ్ పౌడర్ ను చల్లి నిరసన వ్యక్తం చేశాడు. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్‌లో కూడా ఇలాంటి పనే చేశారు.
చర్యలు కఠినంగానే..
నిరసనల నేపథ్యంలో వీరిపై అక్కడి ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నది. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రజలను ఇక్కట్లోకి నెట్టడం అక్కడ జస్ట్ స్టాప్ ఆయిల్ నిరసనకారులకు రివర్స్ ఎటాక్ అయింది. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇప్పటివరకు రోడ్లను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు చేసినందుకు గాను సుమారు 2 వేల మందిపై అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయి. వీరిలో ఏకంగా 20 మంది లండన్ జైళ్లల్లో కూడా శిక్షను అనుభవిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా జస్ట్ స్టాప్ ఆయిల్ ఉద్యమకారులు మాత్రం మరోసారి యాషెస్ ద్వారా తమ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం గమనార్హం.