Ashes 2023 2nd Test: 


యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో అంతరాయం చోటు చేసుకుంది. కొందరు ఆందోళన కారులు లార్డ్స్‌ మైదానంలోకి చొచ్చుకురావడంతో కొంత సమయం మ్యాచ్‌ను నిలిపివేశారు. పిచ్ వద్దకు దూసుకొచ్చిన నిరసనకారులు నారింజ రంగు పొడిని చల్లారు. బ్రిటన్‌లో జరుగుతున్న 'జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌' మూమెంట్‌లో భాగంగా వారీపని చేసినట్టు తెలిసింది.


లార్డ్స్‌ వేదికలో బుధవారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ రెండో టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన బెన్‌స్టోక్స్‌ వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించింది. తొలిరోజు భోజన విరామానికి వికెట్‌ నష్టానికి 73 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (53 బ్యాటింగ్‌; 70 బంతుల్లో 6x4, 1x6) అద్భుతమైన హాఫ్‌ సెంచరీ కొట్టాడు. ఉస్మాన్ ఖవాజా (17; 30 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించాడు.






మ్యాచ్‌ మొదలైన గంట సేపటికి కొందరు ఆందోళనకారులు పిచ్‌ వద్దకు పరుగెత్తుకు వచ్చారు. దాంతో ఆటగాళ్లతో సహా అభిమానులూ స్టన్‌ అయ్యారు. దూసుకొచ్చిన వ్యక్తులు ఆరెంజ్‌ కలర్‌ పౌడర్‌ను చల్లారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 'జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌' అనే ఉద్యమం జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆందోళన కారులు రంగు పొడి చల్లారేమోనని కామెంటేటర్లు అన్నారు.


ఒక ఆందోళనకారుడిని ఇంగ్లాండ్ ఫీల్డర్‌ జానీ బెయిర్‌స్టో అడ్డుకున్నాడు. అతడిని అమాంతం భుజాలపై మోసుకుంటే స్టాండ్స్‌ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి కొత్త జెర్సీ వేసుకొని వచ్చాడు. ఆ తర్వాత అతడి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అభినందించారు. మళ్లీ మ్యాచ్‌ యథావిధిగా కొనసాగింది.


ఇంగ్లాండ్‌లో చాలాసార్లు ఇలాంటి అంతరాయాలు కలుగుతుంటాయి. టీమ్‌ఇండియా ఆడుతున్నప్పుడూ ఒక సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ మైదానంలోకి పదేపదే దూసుకొచ్చాడు. అచ్చం టీమ్‌ఇండియా జెర్సీ వేసుకొని ఫీల్డింగ్‌ చేశాడు. ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చాడు.


y