Steve Smith Record: ఆస్ట్రేలియా   టెస్టు క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, మాజీ సారథి  స్టీవ్ స్మిత్ మరో అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.  యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో  స్మిత్..  9 వేల పరుగులు చేరుకున్న మైలురాయిని అందుకున్నాడు.  టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా  ఈ రికార్డును అందుకున్నవారిలో  స్మిత్ రెండోవాడు.  ఈ క్రమంలో అతడు టీమిండియా  దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ప్రస్తుత  హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల రికార్డులు  బ్రేక్ చేశాడు. 


తన కెరీర్‌లో 99వ టెస్టు ఆడుతున్న  స్మిత్‌కు ఇది లార్డ్స్‌లో  జరుగుతున్న తొలి ఇన్నింగ్స్ 174వది.  ఇంతకుముందు  ప్రపంచ  టెస్టు క్రికెట్ చరిత్రలో 172 ఇన్నింగ్స్‌లలో  9వేల పరుగుల ఘనత సాధించిన ఆటగాడిగా శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర పేరిట ఉంది.  ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే.. 


వేగంగా 9 వేల పరుగులు చేసిన బ్యాటర్స్.. 


- కుమార సంగక్కర (శ్రీలంక) : 172 ఇన్నింగ్స్ 
- స్టీవ్ స్మిత్ (ఆసీస్) :  174 
- రాహుల్ ద్రావిడ్  (ఇండియా) : 176 
- బ్రియాన్ లారా (వెస్టిండీస్) : 177 
- రికీ పాంటింగ్ (ఆసీస్) : 177 
- సచిన్ టెండూల్కర్  (ఇండియా) : 179 


 






రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో  28 పరుగుల వద్దకు చేరుకున్న తర్వాత బెన్ స్టోక్స్ వేసిన బంతిని బౌండరీగా మలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు  31 పరుగులు  చేస్తే  9వేల పరుగుల క్లబ్‌లో  చేరడానికి సిద్ధంగా  ఉన్న స్మిత్.. బౌండరీతో  ఆ రికార్డును అధిగమించాడు.  


స్మిత్ కెరీర్.. 


2010లో  లార్డ్స్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన  స్మిత్.. ఇప్పటివరకు 99 మ్యాచ్ (ఈ మ్యాచ్‌తో కలిపి) 99  టెస్టులు ఆడాడు.  టెస్టులలో 174 ఇన్నింగ్స్ లలో 9వేలకు పైగా పరుగులు చేసిన  స్మిత్ హయ్యస్ట్ స్కోరు  239గా ఉంది.  టెస్టులలో 59.70 సగటుతో  ఆడే  స్మిత్‌కు యాషెస్‌‌లో కూడా గొప్ప రికార్డు ఉంది. ఇంగ్లాండ్‌లో  3 వేలకు పైగా పరుగులు సాధించిన రికార్డు అతడి సొంతం.  స్మిత్ తన కెరీర్ లో ఇప్పటివరకు 31 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు సాధించాడు.  లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో కూడా స్మిత్ (54 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు.   తొలి రోజు మూడో సెషన్ ఆట కొనసాగుతుండగా 63 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్..3 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.