India vs New Zealand Semifinal 1: అప్రతిహాత విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచ్చిన టీమిండియా(India).. న్యూజిలాండ్( New Zealand)తో కీలక సెమీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. గత ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి.. ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలాబలాలు చూస్తే భారత్ దే పైచేయిగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది.
భారత బలాలివే
బ్యాటింగ్‌లో భారత్ చాలా బలంగా ఉంది. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ-శుభ్‌మన్‌గిల్ మంచి భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నారు. భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేక పోయినా తక్కువ ఓవర్లలో ధాటిగా బ్యాటింగ్ చేసి తక్కువ ఓవర్లలో మంచి స్కోరును బోర్డుపై ఉంచుతున్నారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించారు. రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 500కుపైగా పరుగులు జోడించాడు. విరాట్ కూడా 500కుపైగా పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. అయ్యర్, రాహుల్ కూడా శతకాలు చేశారు. గిల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌కు పనిచెప్తే.. కివీస్‌పై గెలుపు నల్లేరుపై నడకే.
బౌలింగ్‌లోనూ తిరుగులేదు
టీమిండియా బౌలింగ్‌లోనూ చాలా బలంగా ఉంది. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్ ప్రత్యర్థి జట్లను పేకమేడలా కూలుస్తున్నారు. లంకను 55 పరుగులకు, దక్షిణ ఆఫ్రికాను 100 పరుగులలోపు.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ను 200 పరుగులలోపు ఆలౌట్ చేశారంటే భారత బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమైన షమీ మిగిలిన నాలుగు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. కానీ స్పిన్ విభాగమే టీమిండియాను కొంచెం ఆందోళన పరుస్తోంది. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ పర్వాలేదనిపిస్తున్నా మేనేజ్‌మెంట్ ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లలో దానికంటే ఎక్కువే ఆశిస్తోంది. వాంఖడేలో బంతితో మాయజాలం చేస్తే ఇక సునాయసంగా న్యూజిలాండ్‌పై గెలిసేయొచ్చు.
న్యూజిలాండ్ బలహీనతలు ఏంటంటే
బ్యాటింగ్‌లో అదరహో
న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో కివీస్ 400 పరుగులు చేసి సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినా కివీస్ బ్యాటింగ్ ధాటిగా సాగింది. కివీస్‌లో రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ భారత సంతతి ఆటగాడు ఇప్పటికే 565 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరమైన మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. డేవిడ్ కాన్వే, డేరిల్ మిచెల్ కూడా ఫామ్‌లో ఉన్నారు. ఫిలిప్స్, శాంట్నర్‌తో చివరి వరకు బ్యాట్‌తో రాణించే వాళ్లు ఉండడం కివీస్‌కు ప్రధాన బలం.
బలహీనంగా కనిపిస్తున్న బౌలింగ్
ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలతో కూడిన కివీస్ బౌలింగ్ బాగానే కనిపిస్తున్నా ఈ ప్రపంచకప్‌లో అంచనాల మేర రాణించలేదు. స్పిన్నర్ శాంట్నర్ కూడా అంచనాలు అందుకున్నాడు. వాంఖడే పిచ్‌పై ఇండియా బ్యాటర్లకు శాంట్నర్ సవాల్ విసరనున్నాడు. కానీ ఏ క్షణంలో అయినా తిరిగి పుంజుకునే అవకాశం ఉన్న కివీస్ బౌలర్లను తక్కువ అంచనా వేయకూడదు. గత ప్రపంచకప్ సెమీస్‌లోనూ 250లోపు లక్ష్యాన్ని న్యూజిలాండ్ కాపాడుకుంది. మరోసారి అదే తప్పు చేయకూడదు. టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే చాలు కివీస్ ఇంటిదారి పట్టక తప్పదు.