World Cup 2023 IND vs NZ Preview : ప్రపంచకప్‌ లీగ్‌ దశలో పరాజయమే లేకుండా సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. కీలక పోరుకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖడే(Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్‌తో (New Zealand)  నాకౌట్‌ మ్యాచ్‌లో  అమీతుమీ తేల్చుకోనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు ఉన్నా సెమీస్‌ ఫోబియా అభిమానులను కలవరపెడుతోంది. ICC టోర్నీల్లో భారత్‌పై కివీస్‌ (India VS New Zealand)కు ఘనమైన రికార్డు ఉన్నా ఈ మ్యాచ్‌లో వాటన్నింటినీ పటాపంచలు చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన కసిగా ఉంది.

 

ఈ మహా సంగ్రామంలో వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్‌(Rohit Sharma) సేన అదే ఊపుతో కివీస్‌ను మట్టికరిపించాలని భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌ను భారత్‌ సాధిస్తుందన్న అంచనాలు భారీగా ఉండడంతో ఆ ఒత్తిడిని టీమిండియా అధిగమించాల్సి ఉంది. జట్టు సభ్యులను ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడంపై కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టి సారించారు. వాంఖడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని భారీ స్కోరు చేస్తే సగం విజయం సాధించినట్లేనని మాజీలు అంచనా వేస్తున్నారు.

వాంఖడేలో ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం కష్టంగా మారనుంది. కొత్త బంతితో తీవ్ర నష్టాన్ని కలిగించే బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. రోహిత్‌ శర్మ మరోసారి రాణిస్తే టీమిండియాకు ఇక ఎదురుండదు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 503 పరుగులు... గిల్‌ 270 పరుగులు చేశారు. మీరు మరోసారి విధ్వంసకర ఓపెనింగ్‌ ఇస్తే భారత్‌ గెలుపు ఖాయమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో 593 పరుగులు చేసి సచిన్‌ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కె.ఎల్. రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది.టీమిండియా బౌలింగ్‌ విభాగం కూడా.... పటిష్టంగా ఉంది. బుమ్రా , సిరాజ్‌, షమీ అదరగొడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా పర్వాలేదనిపిస్తున్నారు.

 

సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర ఈ ప్రపంచకప్‌లో 565 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.  డెవాన్ కాన్వే కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌లతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. సొంత మైదానంలో బరిలోకి దిగుతున్న భారత క్రికెటర్ల ఒత్తిడిని సద్వినియోగం చేసుకోవాలని కివీస్‌ భావిస్తోంది.

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్. 

 

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి , టిమ్ సౌతీ, విల్ యంగ్.