అసలు ఎదురనేదే లేకుండా ప్రపంచకప్ లో దూసుకుపోతున్న భారతజట్టుకు దిష్టి తగిలినట్టు ఉంది. ఓ సాడ్ న్యూస్ భారత ఫ్యాన్స్ ను పలకరించింది. మడమ గాయంతో ఇప్పటికే మూడు మ్యాచులకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇప్పుడు ఇక ఈ ప్రపంచకప్ లోనే ఆడబోడంట. గాయం తీవ్రత అలా ఉంది మరి.


బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తుండగా ఫాలో త్రూలో పాండ్య మడమ గాయం బారిన పడ్డాడు. స్కాన్స్ పూర్తయిన తర్వాత బెంగళూరులోని ఎన్సీఏలో రికవర్ అవుతున్నాడు. కనీసం సెమీస్ సమయానికైనా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్న మేనేజ్మెంట్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బే. మిడిలార్డర్ లో కీలక బ్యాటర్ గా, దాంతో పాటు జట్టు కాంబినేషన్ లో మరింత ముఖ్యమైన ఆరో బౌలర్ గా పాండ్య ఇంపాక్ట్ వెలకట్టలేనిది.


పాండ్య దూరమైన మూడు మ్యాచుల్లో భారత్ సూర్యకుమార్ యాదవ్ ను మిడిలార్డర్ లో దింపి, ఐదుగురు సిసలైన బౌలర్లతో ఆడింది. మన బౌలర్లు నిప్పులు చెరిగే ఫాంలో ఉండటంతో ప్రత్యర్థులు హడలిపోతున్నారు. అయితే కీలకమైన సెమీఫైనల్స్ సమయానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం అన్నది కాస్త దురదృష్టం అనే చెప్పుకోవాలి. బ్యాడ్ లక్ కొద్దీ ఆ రోజున ఎవరైనా బౌలర్ రిథమ్ అందుకోలేకపోతే, అతని కోటా కవర్ చేసేందుకు విరాట్కోహ్లీ లేదా రోహిత్ శర్మ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భం రాకూడదనే మనమంతా కోరుకుందాం. ఐదుగురు బౌలర్లు ఇప్పుడున్న బీభత్సమైన ఫాంను ఇంకా రెట్టింపు చేసుకుంటారనే ఆశిద్దాం. మనకు ముచ్చటగా మూడో కప్ తెచ్చేస్తారనే కోరుకుందాం.