భారత్ వేదికగా జరుగుతున్నప్రపంచకప్‌లో సెమీస్ దిశగా అఫ్గానిస్థాన్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అగ్ర జట్లకు వరుస షాక్‌లు ఇచ్చి సంచలన ప్రదర్శన చేసిన అఫ్గాన్... నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి ఎగబాకింది. ఏడు మ్యాచులతో నాలుగు విజయాలు సాధించి ఎనిమిది పాయింట్లతో అఫ్గాన్.. పాయింట్ల పట్టికలో పాక్‌పైన ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ కేవలం 46.3 ఓవర్లలో 179 పరుగులకే డచ్ జట్టు కుప్పకూలింది. అనంతరం 31.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఘన విజయంతో అఫ్గాన్ సెమీస్ దిశగా మరో అడుగు ముందుకేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన డచ్ బ్యాటర్లు... చేజేతులా అవుటై అఫ్గాన్ బౌలర్లకు శ్రమ తగ్గించారు. టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. లేని పరుగు కోసం యత్నించి నెదర్లాండ్స్ బ్యాటర్లు వికెట్లను సమర్పించుకున్నారు. అఫ్గాన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి డచ్ జట్టుపై ఒత్తిడి పెంచారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు మూడు పరుగుల వద్ద వెస్లీ బారేసీని ముజీబుర్ రెహ్మన్ వికెట్ల ముందు బలిగొన్నాడు. దీంతో తొలి ఓవర్‌లోనే నెదర్లాండ్స్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మాక్స్ ఓ'డౌడ్, కొలిన్ అకెర్మాన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి భాగస్వామ్యంతో నెదర్లాండ్స్ గౌరవప్రదమైన స్కోరు దిశగా పయనించింది. కానీ వీరిద్దరూ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవ్వడం డచ్ జట్టు కొంపముంచింది. 40 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన మాక్స్ ఓ'డౌడ్... 35 బంతుల్లో నాలుగు ఫోర్లతో 29 పరుగులు చేసిన కొలిన్ అకెర్మాన్ రనౌట్ అయి వెనుదిరిగారు. మంచి ఫామ్‌లో ఉన్న సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు.
స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా రనౌట్‌గానే వెనుదిరగడంతో నెదర్లాండ్స్ 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగిలిన బ్యాటర్లు కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. కానీ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ఒంటరి పోరాటం చేశాడు. 86 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేసిన సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కూడా రనౌట్ అయి వెనుదిరిగాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో నలుగురు టాపార్డర్ బ్యాటర్లు రనౌట్‌గానే వెనుదిరిగారు. ఈ రనౌట్లే డచ్ జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాయి. మైదానంలో చురుగ్గా కదిలిన అఫ్గాన్ ఫీల్డర్లు నలుగురు బ్యాటర్లను రనౌట్ చేశారు. మరోవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి డచ్ జట్టుపై ఒత్తిడి పెంచడంతో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. డచ్ జట్టులో ఏడుగురు బ్యాటర్లు రెండంకెలు స్కోరు కూడా చేయలేక పోయారు. అఫ్గాన్ బౌలర్లలో మొహమ్మద్ నబీ 3, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 27 పరుగుల వద్ద అఫ్గాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రహ్మతుల్లా గుర్బాజ్‌ను 10 పరుగుల వద్ద వాన్ బీక్ అవుట్ చేశాడు. 55 పరుగుల వద్ద అఫ్గాన్ మరో వికెట్ కూడా కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగేలా కనిపించింది. కానీ రహ్మత్ షా... అహ్మదుల్లా షాహీదీ అర్ధ శతకాలతో అఫ్గాన్‌కు విజయాన్ని అందించారు. రహ్మత్ షా 54 బంతుల్లో 56 పరుగులు చేసి అవుటైనా అప్పటికే అఫ్ఘానిస్థాన్ విజయం ఖాయమైంది. తర్వాత పనిని ఒమ్రాజాయ్‌తో కలిసి అహ్మదుల్లా షాహీదీ పూర్తి చేశాడు. ఈ విజయంతో అఫ్గాన్ ఒకే ప్రపంచకప్‌లో నాలుగు విజయాలు సాధించి చరిత్ర సృష్టించింది. అలాగే పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.