ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచం మొత్తం భారత్‌-న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌ను చూసేందుకు మాజీ దిగ్గజ క్రికెటర్లు తరలిరానున్నారు. ఇప్పటికే వీఐపీ గ్యాలరీలో టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సెమీస్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఓ ప్రత్యేక అతిథి భారత్‌ రానున్నాడు. అతనెవరంటే  ఇంగ్లండ్ మాజీ స్టార్‌ ఫుట్‌బాల‌్‌ ప్లేయర్‌ డేవిడ్ బెక్‌హ‌మ్. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్‌ ముంబయికి రానున్నాడు. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా  బెక్‌హ‌మ్ ఉన్నాడు. మూడు రోజుల‌ ప‌ర్యట‌న‌లో భాగంగా భార‌త్‌కు రానున్న బెక్‌హమ్‌ భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగే సెమీస్‌కు హాజరవుతాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. స్వత‌హాగా ఫుట్‌బాల‌ర్ అయిన బెక్‌హ‌మ్‌కు క్రికెట్ అంటే ఇష్టం.  వ‌ర‌ల్డ్ క‌ప్ లాంటి మెగా టోర్నీని బాగా ఫాలో అవుతుంటాడు. బెక్‌హ‌మ్ ప్రస్తుతం ఇంట‌ర్ మియామి క్లబ్‌కు సహ య‌జమానిగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే ఈ క్లబ్ అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీని భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది.



 భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు(బుధవారం) జరగనున్న తొలి సెమీస్‌కు ముంబయిలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి సెమీఫైన‌ల్లో భార‌త్, కివీస్ హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. లీగ్ ద‌శ‌లో ఎదురైన ఓట‌మికి బ‌దులు తీర్చుకోవాల‌ని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే 2019 ఎడిష‌న్ సెమీస్‌లో ప‌రాభ‌వానికి ప్రతీకారంగా కివీస్‌ను ఇంటికి పంపాల‌ని రోహిత్ సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ప్రస్తుతం అజేయంగా సెమీస్‌కు చేరిన టీమిండియా జోరు చూస్తేంటే కివీస్‌కు మ‌రోసారి భంగ‌పాటు త‌ప్పక‌పోవ‌చ్చని మాజీలు అంటున్నారు.



ఈ మహా సంగ్రామంలో తొలి సెమీస్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు జట్టు తుది కూర్పు, మిడిలార్డర్‌ వైఫల్యం వంటి సమస్యలతో కనిపించిన రోహిత్‌ సేన.. బరిలోకి దిగాక మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. గత నెల ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రోహిత్‌సేన ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ల ప్రస్థానం... నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ వరకు నిరాటంకంగా సాగింది. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ముచ్చటగా మూడోసారి టీమిండియా కప్పును ముద్దాడుతుంది. 



   భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్‌..మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు దాదాపుగా బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. 2019 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూడిలాండ్‌పై ఈ నాకౌట్‌ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఓసారి ప్రతీకారం తీర్చుకుంది. కానీ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది.