South Africa Curse of the knockouts: చోకర్స్‌(Chokers)... కీలకమైన మ్యాచుల్లో తరచూ ఓడిపోయే జట్లను ఈ పేరుతో పిలుస్తుంటారు. అప్పటివరకూ కీలకంగా ఆడి క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ లాంటి మ్యాచుల్లో ఓడిపోయే జట్లను, ప్లేయర్లను హేళన చేసేందుకు చోకర్స్ అనే మాటను క్రికెట్‌లో చాలామంది వాడుతుంటారు. ప్రపంచకప్‌లో సెమీస్‌లో వెనుదిరగడం దక్షిణాఫ్రికా(South Africa)కు ఇది అయిదోసారి. టీ 20 వరల్డ్‌ కూడా కలుపుకుంటే ఏడోసారి, 1992, 1999, 2007, 2015, 2023 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా... 2009, 2014 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో కూడా ఓడిపోయి ఈ చోకర్స్‌ అనే మాటను సార్ధకం చేసుకుంటోంది. 


అయితే ఈ చోకర్స్ పేరును పోగుట్టుకునేందుకు దక్షిణాఫ్రికా దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే చిన్నపాటి యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ చోకర్స్ ముద్రును పోగుట్టుకునే అవకాశం చేతిదాక వచ్చి చేజారిపోయింది. అత్యుత్తమ జట్టుగా పేరుగాంచిన ప్రొటీస్‌(proteas)...కీలకమైన మ్యాచుల్లో చేతులెత్తేయడం... అది చూడలేక అభిమానుల హృదయం బద్దలవ్వడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఇంకెతకాలం ఇది కొనసాగుతుందో.. సఫారీల దురదృష్టం ఎప్పుడు మాయమవుతుందోనని అభిమానులు ఆవేదనతో చర్చించుకుంటున్నారు. ప్రపంచ క్రికెట్‌లో చోకర్స్‌గా ముద్రపడిన జట్టు దక్షిణాఫ్రికా. 
 ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో బలమైన జట్లలో ఒకటిగా నిలవడం,సెమీస్ వరకు చేరడం.. ఆ తర్వాత ఓడిపోయి ఇంటికి వెళ్లడం.... ఇది కొన్ని దశాబ్దాలుగా సౌతాఫ్రికా జట్టు సాగిస్తున్న ప్రయాణం. కొన్నేళ్లుగా కీలకమైన నాకౌట్ మ్యాచుల్లో ఒత్తిడికి చిత్తు అవుతూ ఈ అపఖ్యాతిని మూటగట్టుగుంటూనే ఉంది ప్రొటీస్‌. పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడి గురయ్యే బలహీనత వెంటాడిన వేళ.. 2023 ప్రపంచకప్‌లో అయిదోసారి దక్షిణాఫ్రికా  ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి పాలైంది. 1992, 1999, 2007, 2015 ప్రపంచకప్‌లలోనూ సెమీఫైనల్లోనే ప్రోటీస్‌ వెనుదిరిగింది. ఈసారి టోర్నీలో ఆ జట్టు దూకుడు చూస్తే కచ్చితంగా ఫైనల్‌ చేరుతుందని, భారత్‌ను తుదిపోరులో ఢీ కొడుతుందనే అనుకున్నారంతా. కానీ మరోసారి దక్షిణాఫ్రికా ఒత్తిడికి చిత్తయింది. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా ప్రదర్శనపై నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి. మ్యాచ్ ఫలితం రాగానే నెట్టింట #Chokers చోకర్స్ అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీరు చోకర్స్ అనే మాట పొందెందుకు నిజమైన అర్హులు అంటూ ప్రొటీస్ జట్టుపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


గతంలో దిగ్గజ ఆటగాళ్ల హయాంలోనూ దక్షిణాఫ్రికా సెమీస్ వరకు చేరింది. ఈ సారి ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన, భారీ విజయాలు చూస్తే కప్ సఫారీలు నెగ్గినా ఆశ్చర్యం అక్కర్లేదు అనుకున్నారు. కానీ పోరాటానికి మారుపేరుగా నిలిచే ఆస్ట్రేలియా టీమ్ ప్రత్యర్థి ప్రొటీస్ ను కంగారుపెట్టి విజయం సాధించి, మరోసారి ఫైనల్ చేరడంతో చోకర్స్ అని దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ట్రోల్ చేస్తున్నారు.



కొందరైతే.. గురువారం నాటి మ్యాచులో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఆశ మరోసారి నెరవేరలేదని వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ ప్రపంచకప్‌తో వన్డేలకు వీడ్కోలు పలికిన డికాక్‌.. నాలుగు సెంచరీలు సహా 594 పరుగులు చేశాడు. ఆఖరికి కన్నీళ్లతో దక్షిణాఫ్రికా మైదానం వీడటంతో సఫారీ అభిమానులూ నిరాశలో మునిగిపోయారు. అయితే దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరాలని భారత అభిమానులూ కోరుకున్నారు. దాదాపు పూర్తిగా నిండిన స్టేడియంలో అత్యధిక శాతం భారత అభిమానులు దక్షిణాఫ్రికాకే మద్దతు తెలిపారు. చివరకు ఆ జట్టు ఓడితే.. సఫారీ ఆటగాళ్లు, అభిమానులే కాదు మనవాళ్లూ బాధ పడ్డారు.