U-19 Women’s WC: అమ్మాయిలు అదరగొట్టారు. భారత మహిళల క్రికెట్ లో అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ టోర్నీని ఒడిసిపట్టారు. సీనియర్ అమ్మాయిలు వన్డేల్లో 2 సార్లు, టీ20ల్లో ఒకసారి కప్పు అందుకోవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయారు. అయితే జూనియర్లు మాత్రం ఆ ఒక్క అడుగునూ వేసేశారు. అండర్- 19 మహిళల తొలి టీ20 ప్రపంచకప్ ను సగర్వంగా అందుకున్నారు. ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా జూనియర్ అమ్మాయిలు ఐసీసీ ట్రోఫీని సాధించారు.
అండర్- 19 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆనందంలో భారత అండర్- 19 జట్టు సంబరాలు చేసుకుంది. జూనియర్ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. హిందీ సినిమా పాట 'కాలా చష్మా'కు భారత ప్లేయర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఐసీసీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 7 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
మ్యాచ్ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ షెఫాలీ వర్మ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ భారత యువ బౌలర్లు రెచ్చిపోయారు. స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరగానే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లిబర్టీ హీప్ (0: 2 బంతుల్లో) వికెట్ తీసి టిటాస్ సధు భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రియానా మెక్‌డొనాల్డ్ గే (19: 24 బంతుల్లో, మూడు ఫోర్లు), ఛారిస్ పేవ్లీ (2: 9 బంతుల్లో) ఐదో వికెట్‌కు జోడించిన 17 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. భారత బౌలర్లలో బౌలింగ్ చేసిన అందరూ వికెట్ తీశారు. టిటాస్ సధు, అర్చనా దేవి, పార్శ్వి చోప్రాలు 2 వికెట్లు తీశారు. తన 4 ఓవర్ల కోటాలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్ సధు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఇంగ్లండ్ 17 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది.
స్వల్ప లక్ష్యాన్ని భారత అమ్మాయిలు ఆడుతూ పాడుతూ ఛేదించారు. మొదట కెప్టెన్ షెఫాలీ వర్మ (15), శ్వేతా సెహ్రావత్ (5) వికెట్లు త్వరగానే కోల్పోయినప్పటికీ ఎక్కడా తడబడలేదు. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. సౌమ్య తివారీ (24: 37 బంతుల్లో, 3 ఫోర్లు), తెలంగాణకు చెందిన ప్లేయర్ గొంగడి త్రిష (24: 29 బంతుల్లో, 3 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. విజయం ముంగిట గొంగడి త్రిష అవుట్ అయినా.. రిషితా బసుతో కలిసి సౌమ్య తివారీ మ్యాచ్‌ను ముగించింది.