IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో థ్రిల్లింగ్ టీ20లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ (26: 31 బంతుల్లో, ఒక ఫోర్) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. మూడో టీ20లో గెలిచిన జట్టు సిరీస్‌ను గెలుచుకోనుంది.
100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఇషాన్ కిషన్ కూడా తొమ్మిదో ఓవర్లో అవుటయ్యాడు. అయితే కొట్టాల్సిన లక్ష్యం తక్కువే కావడంతో భారత బ్యాటర్లు ఎక్కడా కంగారు పడలేదు.
దీనికి తోడు న్యూజిలాండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిషెల్ శాంట్నర్ ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ఉపయోగించాడు. అందరూ పొదుపుగానే బౌలింగ్ వేశారు కానీ వికెట్లు తీయడంలో విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ఇష్ సోధి, మైకేల్ బ్రేస్‌వెల్‌లకు చెరో వికెట్ దక్కింది.
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే న్యూజిలాండ్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (11: 10 బంతుల్లో, రెండు ఫోర్లు), డెవాన్ కాన్వే (11: 14 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. వీరు అవుటయ్యే సరికి జట్టు స్కోరు 28 పరుగులు మాత్రమే. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఫిన్ అలెన్ మాత్రమే 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. మిగతా ఎవరి స్ట్రైక్ రేట్ కనీసం 85 కూడా దాటలేదు. కెప్టెన్ మిషెల్ శాంట్నర్ (20 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకోగా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.
భారత తుదిజట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్ తుదిజట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డేరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్