Naba Kishore Das: పోలీస్ అధికారి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్ దాస్ మరణించారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రిపై పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. మంత్రి కిషోర్ దాస్ తన కారు నుంచి దిగినప్పుడు దగ్గర్లోంచి ఆయనపై కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ మంత్రి ఆరోగ్యం మెరుగుపడలేదు. గాయాల తీవ్రత అధికంగా ఉండడంతో మంత్రి నబా మరణించారని వైద్యులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బ్రజరాజ్‌నగర్ పట్టణంలో మంత్రి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 






ఏఎస్ఐ కాల్పులు


అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్‌ఐ) గోపాల్ దాస్ మంత్రిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మంత్రిని వెంటనే ఆసుపత్రికి తరలించారని అని బ్రజ్‌రాజ్‌నగర్ SDPO గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. నిందితుడు ఏఎస్ఐని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్పారు. ఏఎస్ఐ కాల్పులు జరపడానికి గల కారణాలను విచారిస్తున్నామని భోయ్ చెప్పారు. ఒక వీడియో ఫుటేజీలో కాల్పుల్లో గాయపడిన మంత్రిని పైకి లేపి కారు ముందు సీటుపై ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంత్రి ఛాతీ నుంచి రక్తస్రావం కనిపించింది. ముందుగా నబా కిషోర్ దాస్ ను జార్సుగూడ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ కు విమానంలో తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నబా దాస్ మద్దతుదారులు భద్రతా లోపాల కారణంగానే మంత్రి చనిపోయారని ఆందోళనకు దిగారు. మంత్రిని టార్గెట్ చేసి కుట్ర ప్రకారం హతమార్చారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏఎస్‌ఐని విచారిస్తున్నామని, సమగ్ర విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్డీపీవో భోయ్ చెప్పారు. 


అసలేం జరిగింది?


ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రిపై పోలీస్ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఆదివారం నాడు ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీ చౌక్ సమీపంలో ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లాయి. ఓ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఝూర్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్ లోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్న నబా కిశోర్ దాస్.. వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. అయితే దాడికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


నబా మరణం తీరని లోటు- సీఎం నవీన్ పట్నాయక్ 


మంత్రి నబా కిశోర్‌ దాస్‌ మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. నబాను కాపాడేందుకు వైద్యులు చాలా కృషిచేశారని, కానీ దురదృష్టవశాత్తు ఆయన రికవరీ కాలేదన్నారు. నబా కిషోర్ దాస్ ప్రభుత్వానికి, పార్టీకి గొప్ప ఆస్తి అన్నారు. ఆరోగ్యశాఖలో అనేక కార్యక్రమాలను ఆయన విజవయంతంగా నిర్వహించారని, ప్రజలకు లబ్దిచేకూరేందుకు కృషిచేశారని సీఎం గుర్తుచేసుకున్నారు.  క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నబా కిశోర్‌ దాస్‌ బీజేడీని బలోపేతం చేయడంలో ఎంతో కీలకంగా పనిచేశారన్నారు. మంత్రి నబా మరణం ఒడిశా రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.