CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఖరారైంది. రేపు, ఎల్లుండి రెండ్రోజుల పాటు సీఎం జగన్ దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 6.45 గంటలకు సీఎం జగన్ దిల్లీ చేరుకోనున్నారు. సోమవారం 1-జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బసచేస్తారు. మంగళవారం ఉదయం 10.30 – 5.30 గంటల వరకు దిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మంగళవారం సాయంత్రం 6.05 గంటలకు దిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  
 
సీఎం జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన


రేపు సీఎం జగన్ పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 – 12.20 వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చిన్న తరహా వ్యాపారస్తులందరికీ వైసీపీ సర్కార్ జగనన్న చేదోడు పథకం ద్వారా ప్రోత్సాహంక ఇస్తుంది. ఈ పథకం ద్వారా దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్థికసాయం అందిస్తుంది. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సోమవారం సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. ఈ పథకం కింద రూ.10,000 చొప్పున ఏటా సాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నగదుతో అవసరమైన చేతి పనిముట్లు, పెట్టుబడికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా వినుకొండలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.  


కీలకంగా మారిన దిల్లీ పర్యటన


ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సీఎం జగన్‌ దిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   రాష్ట్రంలో ముందస్తుకు సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో పలు అంశాలపై సీఎం జగన్‌ దిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ కోసం గతంలో వెళ్లిన పర్యటనకు కొనసాగింపు గానే ఈసారి వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పలు కీలక అంశాలపై దిల్లీ పెద్దలతో సీఎం జగన్‌ చర్చించే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తోం ది. మోదీ, అమిత్ షా తో భేటీ అవుతారని అధికార సమాచారం లేదు. కానీ దిల్లీ పర్యటనలో అపాయింట్మెంట్లు ఖరారైతే కేంద్ర పెద్దలను సీఎం జగన్ కలవనున్నారని ప్రచారం జరుగుతోంది.  


ఆర్థిక సమస్యలు తీరాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి


రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. అవి తీరాలంటే తప్పనిసరిగా కేంద్రం సహకారం అవసరం. ఇంకా రెండు నెలలు గడవాల్సి ఉంది. అప్పుల పరిమితి అంతా  ముగిసిపోయింది. పలు రుణాల తిరుగు చెల్లింపులు పెండింగ్ ఉండిపోయాయి. వీటన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు ఉన్నతాధికారులు వెళ్లి .. పరిస్థితిని  చక్కదిద్దేవారు. కానీ ఈ మధ్య జగనే స్వయంగా దిల్లీ వెళ్లి నేరుగా ప్రధానిని కలుస్తున్నారు. ఆ తర్వాత కొంత ఊరట లభిస్తోంది. ఈ కోణంలోనూ ఆయన దిల్లీ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.