Delhi Khalistan Attacks : దేశ రాజధాని దిల్లీలో ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దిల్లీలో ఖలిస్థాన్‌ ఉగ్ర నెట్‌వర్క్‌ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల దిల్లీలోని చాలా చోట్ల  ఖలిస్థాన్‌కు మద్దతుగా పెయింటింగ్‌లు, గోడలపై రాతలు కనిపిస్తున్నాయి నిఘా వర్గాలు తెలిపాయి. వికాశ్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్‌ విహార్‌, పీరాగర్హ, పశ్చిమ దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో ఖలిస్థాన్ కు మద్దతుగా రాతలు కనిపించాయి. పోలీసులు వీటిని తొలగించారు. దిల్లీలో ఖలిస్థాన్ ఉగ్రసంస్థ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.


దిల్లీలో స్లీపర్ సెల్స్ 


దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఖలిస్థాన్ స్లీపర్ సెల్స్, టెర్రర్ నెట్‌వర్క్‌లు యాక్టివ్‌గా ఉన్నట్లు నిఘా సంస్థలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా పశ్చిమ దిల్లీలో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు,  పెయింటెడ్ గ్రాఫిటీలు కనిపిస్తున్నాయి. జనవరి 12న దేశ రాజధానిలో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు వేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో ఖలిస్థాన్  స్లీపర్ సెల్స్ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ మీడియా తెలిపింది. వికాశ్ పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హితో పాటు పశ్చిమ దిల్లీలోని ఇతర ప్రాంతాల్లో అభ్యంతరకర నినాదాలతో కనిపించిన గ్రాఫిటీలు పెద్ద కుట్రలో భాగం కావచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.






ఖలిస్థాన్ అనుకూల రాతలు 


దిల్లీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు నిధులు అందాయని అరెస్టైన నిందితులు పోలీసులకు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లను స్థానిక పోలీసులు తొలగించి గోడలకు రంగులు వేశారు. గోడలపై ఖలిస్థాన్ అనుకూల రాతలు రాసిన ఘటనలో రెండు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం (153-B), నేరపూరిత కుట్ర (120-B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. దేశ రాజధానిలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించేలా ఖలిస్థాన్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు సిక్‌ ఫర్‌ జస్టిస్ (SFJ) ఉగ్రవాద సంస్థకు చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ విడుదల చేసిన ఓ వీడియో కలకలం రేపింది. రిపబ్లిక్‌ డే రోజున ప్రత్యేక పంజాబ్‌ అనుకూల సంస్థ ఎస్‌ఎఫ్‌జే ఉగ్రదాడులకు పాల్పడుతుందన్నది ఓ వీడియో సారాంశం. జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి, లేదంటే భారీ మూల్యం తప్పదంటూ ఉగ్రవాదులు హెచ్చరించారు. దేశ రాజధాని దిల్లీనే మా లక్ష్యం అదే రోజు ఖలిస్థాన్‌ జెండాను ఆవిష్కరిస్తామని గురుపత్వంత్‌ సింగ్‌ వీడియోలో చెప్పాడు.