IAF Official Statement:  భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు  ఒకే సమయంలో  మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా సమీపంలో కూలిపోయాయి. ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే రాజస్థాన్ లోని భరత్ పూర్ నగరంలో ఒక చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు సమాచారం. 


దీనిపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది. నిత్య ప్రాక్టీస్ లో భాగంగా సుఖోయ్- 30, మిరాజ్ 2000 విమానాలు గాల్లోకి ఎగిరినప్పుడు ఆకాశంలో ఢీకొన్నాయని ఐఏఎఫ్ తెలిపింది. తర్వాత ఈ రెండు జెట్ లకు మంటలు అంటుకుని మొరానా అడవుల్లో పడిపోయాయని చెప్పింది. ప్రమాదం ఎలా జరిగిందనేది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ స్పష్టం చేస్తుందని ఐఏఎఫ్ తెలిపింది. 


ఇద్దరు పైలట్లు సురక్షితం, ఒక పైలెట్ మృతి


సుఖోయ్-30లో ఇద్దరు పైలట్లు ఉన్నారు, వారు సకాలంలో పారాచూట్‌లను ఉపయోగించి జెట్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మిరాజ్ 2000 విమానంలో ఉన్న పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయని.. చికిత్స అందించేలోపే అతను మరణించాడని ఐఏఎఫ్ తెలిపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసు-అడ్మినిస్ట్రేషన్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మొత్తం విషయంపై ఆరా తీశారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 


ఉదయం 9.55 గంటల ప్రాంతంలో ప్రమాదం


ఈరోజు ఉదయం 9.55 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానాలు ఢీకొని కిందకు పడిపోవడాన్ని సంఘటన స్థలంలో ఉన్న ప్రజలు చూసినట్లు తెలుస్తోంది. వారే ప్రమాద ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం స్క్వాడ్రన్ లీడర్లు రాయ్, మిథున్ ను రక్షించారు.