Hyderabad G-20 Startup 20 Inception : హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటలో జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జీ-20 స్టార్టప్ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు, 9 దేశాల ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రతినిధులు చర్చిస్తు్న్నారు. ఈ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉద్యోగాల కోసం వేచిచూడటం కన్నా ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందన్నారు.  ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. 85 వేలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్‌లతో ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉందన్నారు. ఈ స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని తెలిపారు. అందుకే ఈ వ్యవస్థను ప్రోత్సహించేలా పాలసీలు రూపొందించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానాలు మెరుగుపడిందన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని మరిన్ని కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకెళ్తోందన్నారు.  


యువతే దేశానికి ఆస్తి 


భారతదేశానికి యువ జనాభాయే బలమైన ఆస్తి అన్న కిషన్ రెడ్డి.. దేశ యువత తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుస్తూ, దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చేందుకు వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తోందన్నారు. సరికొత్త సాంకేతికతతో, సృజనాత్మకమైన ఐడియాలతోపాటు చిత్తశుద్ధితో యువత చేస్తున్న కృషి కారణంగానే ఇవాళ భారతదేశం స్టార్టప్ ల రంగంలో ప్రపంచంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటుచేసుకుందని కేంద్రమంత్రి అన్నారు. భారత యువతను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ ల రంగానికి మరింత చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’ వంటి పథకాలను తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెరగడం కూడా స్టార్టప్ లకు ప్రోత్సాహకరంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కారణంగా మరిన్ని FDIలు వస్తున్నాయన్నారు. దీని కారణంగా వచ్చే 25 ఏళ్లలో భారతదేశంలో స్టార్టప్ లు మరింతగా వృద్ధి చెంది జీడీపీలో కీలకం అవుతాయని ఆయన అన్నారు.


అభివృద్ధి ఫలాలు అందరికీ 


‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో అందరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు, డిజిటల్ మౌలికవసతుల కల్పనకు, డీ-కార్బనైజేషన్ ప్రక్రియలపై ప్రత్యేక విధానాలతో భారత స్టార్టప్ లు పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా స్టార్టప్ లు భారతీయ స్టార్టప్ వ్యవస్థ పనిచేస్తోందని ఈ దిశగా మరింత పురోగతి జరగాలని ఆయన అన్నారు. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే.. గత 7 ఏళ్లలో భారతదేశం గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో 41 స్థానాలను మెరుగుపరుచుకుందని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రాచీనకాలం నుంచి ప్రపంచ దేశాలతో ఎటువంటి ప్రతిఫలం లేకుండా భారత్ తన జ్ఞానాన్ని పంచుకుంటోందన్న కిషన్ రెడ్డి.. జీ-20 సదస్సుకోసం ఎంచుకున్న థీమ్ కూడా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుగా నిర్ణయించడం, వసుధైవ కుటుంబకం అనే ప్రాచీన భారత విధానానికి నిదర్శనమన్నారు. ఈ నినాదంతో భారత్ బాధ్యతగా వ్యవహరిస్తూ, ఇతర దేశాలతో కలిసి నడుస్తూ, సాధించిన విజయాలను ఇతరులతో పంచుకోవడం కృషిచేస్తోందన్నారు. జీ-20 దేశాల సదస్సుకోసం వస్తున్న వివిధ దేశాల ప్రతినిధులు, సమావేశ కేంద్రాల సమీపంలోని పర్యాటక కేంద్రాలను సందర్శించాలని కిషన్ రెడ్డి సూచించారు. స్థానిక సంస్కృతి, కళలతోపాటు స్థానిక వంటకాలను కూడా రూచిచూడాలంటూ ఆహుతులను కోరారు. 


రోజుకు ఐదారు కొత్త స్టార్టప్ లు 
 
దేశంలో తెలంగాణ యువ రాష్ట్రంగా నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ముందుకు దూసుకెళ్తుందన్నారు. దేశంలో 19 వేల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నారు. రోజుకు ఐదారు కొత్త స్టార్టప్ కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలు, ఐటీ, విద్య, వైద్య రంగాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా వస్తున్నాయని పరమేశ్వరన్ అయ్యర్ చెప్పారు. ఇంటర్నెట్ సేవలు విస్తృతం అవుతుండడంతో స్టార్టప్ సంస్థల్లో కొత్త ఆలోచనలు వస్తున్నాయన్నారు. నీతి అయోగ్ కూడా థింక్ ట్యాంక్ లాంటిదని నీతి ఆయోగ్ సీఈవో అన్నారు. కేంద్రం రాష్ట్రాలకే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నీతి ఆయోగ్ పరిధిలో చాలా ఇన్నోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా 69 ఇంక్యూబేషన్ సిస్టమ్స్ ఏర్పాటుచేశామన్నారు.