Taraka Ratna Health: తారక రత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా బ్రాహ్మిణి బెంగళూరుకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వస్తున్నారని తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి పంపించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో వచ్చిన వీరిని ఆరోగ్య మంత్రి ఎయిర్ పోర్టులోనే కలిశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటే టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు.


ముందుగా తారకరత్నను చూసిన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా కోరినట్లు తెలుస్తోంది.


తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకరన్ కూడా ఆరా తీశారు. నారాయణ హృదయాలకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని ముఖ్యమంత్రి బొమ్మై.. మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా మంత్రి మాట్లాడారు.



నిన్న ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబు..


బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య బృందంతో మాట్లాడిన చంద్రబాబు... తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. తారకరత్నకు పాదయాత్ర సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. కుప్పంలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం బెంగళూరు తరలించామన్నారు. తారకరత్న ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. తారకరత్న వైద్యుల పర్యవేక్షణలోఉన్నారన్నారు.  తాను వైద్యులతో మాట్లాడానని, తారకరత్న కోలుకోడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. వైద్యులు అన్నిరకాల మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. 




అసలేం జరిగిందంటే?


నందమూరి తారకరత్నకు జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురై స్థానిక ఆసుపత్రిలో చేరారు. కుప్పం ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు వైద్యులు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తారకరత్నను పర్యవేక్షించేందుకు బెంగళూరు నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) ఒక బృందం కుప్పం వచ్చింది. అతని పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు కుప్పం వచ్చారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ (IABP) వాసోయాక్టివ్ మద్దతుతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 1 గంటలకు రోడ్డు మార్గంలో తారకరత్నను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికే అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ-డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.