Hyderabad Crime News: ఆమెకు అప్పటికే పెళ్లి అయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటూ కూలీగా మారి జీవనం సాగిస్తోంది. ఈక్రమంలోనే తనకంటే తొమ్మిదేళ్ల చిన్నవాడైన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పిల్లలను హాస్టల్ లో చేర్పించి మరీ ఇతడితో ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న వీరిద్దరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


బాలాపూర్ మండల్ లెనిన్ నగర్ కు చెందిన తూర్పాటి చెన్నమ్మ కుమార్తె 30 ఏళ్ల సరస్వతికి 13 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండే వాళ్లు. వీరి ప్రేమకు ప్రతీకలుగా ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు జన్మించారు. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందాడు. తల్లి చెన్నమ్మ, సోదరుడు యాదగిరి సూచనలో... నాటి నుంచి లెనిన్ నగర్ లోనే ఉంటూ కూలీ పనులు చేయసాగింది. నలుగురు పిల్లలనూ ఓ వసతి గృహంలో చేర్పించి చదివిస్తోంది. కుర్మల్ గూడ రాజీవ్ గృహ కల్పలో 21 ఏళ్ల సాదు మహేందర్ నివసిస్తున్నాడు తల్లి చెన్నమ్మ, సోదరుడు యాదగిరి ఎంత చెప్పినా వినకుండా అతడితోనే ఉంటోంది. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే.. తనకూ, మహేందర్ కు పెళ్లి కూడా జరిగిందని చెబుతోంది. 


అయితే గత కొంత కాలంగా మహేందర్, సరస్వతిల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో లెనిన్ నగర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది సరస్వతి. వారం రోజుల పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత మళ్లీ మహేందర్ దగ్గరకు వెళ్లింది. శనివారం తెల్లవారుజామున సరస్వతి, మహేందర్ లు... రాజీవ్ గృహ కల్పలోని నివాసంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని బంధువుల ద్వారా తెలిసింది. దీంతో సరస్వతి కుటుంబీకులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లారు. అక్కడ సరస్వతి మృతదేహం నేలపై పడి ఉండగా... మహేందర్ ఉరి వేసుకొని కనిపించాడు. యాదగిరి ఫిర్యాదుతో పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


మూడ్రోజుల క్రితం సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య


హైదరాబాద్ చంపాపేట్ సాయిరాం నగర్ లో నివాసం ఉండే 24 ఏళ్ల బి మోహన్ కృష్ణ ఓ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోవడంతో... తల్లి, అన్నయ్య, వదినతో కలిసి ఉంటున్నాడు. అయితే కొంత కాలంగా మోహన్ కృష్ణ ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడు. ఎంత పోగొట్టుకున్నా ఏమాత్రం భయం, బెరుకూ లేకుండా తన వద్ద ఉన్నందతా పెట్టేశాడు. అదీ పోగా.. అప్పులు చేశాడు. ఆ డబ్బును కూడా ఆన్ లైన్ బెట్టింగ్స్ లో పెట్టి అప్పులపాయ్యాడు. ఈ విషయాన్ని ఇటు ఇంట్లో చెప్పలేక, అటు డబ్బులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డాడు. తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ కృష్ణ చావే శరణ్యం అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న అతడు.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లాడు.


బొల్లరంబజార్-అల్వాల్ రైల్వే స్టేషన్ మధ్య రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయాడు. మరుసటి రోజు అక్కడ ఓ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. ఓ యువకుడు మృతదేహం రైలు పట్టాలపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభ్యమైన సెల్ ఫోన్ ఆధారంగా చనిపోయింది మోహన్ కృష్ణగా తేల్చారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.