ఆధునిక యువతలో అందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జుట్టు కూడా అందులో ఒక భాగమే. పొడవాటి పట్టుకురుల్లాంటి జుట్టు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. అయితే ఎక్కువ మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. సరైన పోషకాలు అందక జుట్టు ఇలా రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి జుట్టుకు మేలు చేసే ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వెంట్రుకలు బలంగా నిగనిగలాడుతూ పెరగడానికి ఏం తినాలో చూద్దాం.


1. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్ అత్యవసరం. ప్రోటీన్ ఉన్న ఆహారాలను రోజూ తినాలి. దీనివల్ల వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం వల్ల మాడుకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల వెంట్రుకలు పెరగడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పెరుగును రోజూ తినండి. ఒక కప్పు పెరుగు తినడం వల్ల నెల రోజుల్లోనే మీకు జుట్టులో మార్పు కనిపిస్తుంది. వెంట్రుకలు పలుచబడకుండా, ఊడిపోకుండా ఉంటాయి.


2. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీంట్లో ఉండే పోలిక్ యాసిడ్ మన ఆరోగ్యానికి అత్యవసరమైనది. ముఖ్యంగా గర్భిణీలు కచ్చితంగా తినాల్సిన ఆకుకూర పాలకూర. దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్ లభిస్తాయి. ఈ మూడు కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరమైనవి. తలపైన ఉన్న మాడు ఎంత ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు కూడా అంతే ఆరోగ్యంగా పెరుగుతాయి. పాలకూరలో ఉన్న పోషకాలు, మాడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. వెంట్రుకలు చిట్లి పోకుండా ఎదుగుతాయి. 


3. మాంసాహారులకు చేపలు ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే చేపల్లో నిండుగా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలను మన శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి వాటిని ఆహారం ద్వారానే తీసుకోవాలి. సప్లిమెంట్ల రూపంలో కూడా వీటిని అమ్ముతున్నారు. ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. పుష్కలంగా ఉండే సాల్మన్, సార్డయిన్, మాకెరెల్ వంటి చేప రకాలతో పాటూ, కొవ్వు పట్టిన చేపలు వారానికి రెండుసార్లు తింటే జుట్టు పెరుగుదలలో మార్పు మీకే కనిపిస్తుంది. 


4. జామ పండు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనే ఉంటుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజు ఒక కప్పు జామ పండ్ల ముక్కలు తినడం వల్ల విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఈ విటమిన్ సి వెంట్రుకలు చిట్లిపోకుండా, విరిగిపోకుండా కాపాడుతాయి.


5. ఆహారంలో దాల్చిన చెక్కను కూడా భాగం చేసుకోవాలి. దాల్చిన చెక్క రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ తో పాటు పోషకాలు ఎక్కువగా అందేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు ఊడకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. 


6. జుట్టు ఎదుగుదలకు ఐరన్ కూడా అవసరం. ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఆకుకూరలతో పాటు మాంసాహారంలో కూడా ఐరన్ ఉంటుంది. అనేక రకాల పదార్థాల్లో ఇనుము లభిస్తుంది. ఆ పదార్థాలు తినడం ద్వారా జుట్టు ఊడకుండా కాపాడుకోవచ్చు.


7. వెంట్రుకలు దట్టంగా పెరగాలంటే మాంసాహారం, గుడ్లు అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా చికెన్ తినాలి. చికెన్లో ఉండే ప్రోటీన్, గుడ్లలో ఉండే బయోటిన్ వెంట్రుకలు పెరగడానికి సహాయపడతాయి. తగినంత ప్రోటీన్ అందకపోతే జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. 


8. చిలగడ దుంపలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో బీటా కెరాటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు క్యారెట్, గుమ్మడి, మామిడి పండ్లు. వీటిని తరచూ తినడం వల్ల జుట్టు నిగనిగ లాడుతుంది. 


Also read: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.