Womens Asia Cup: ఆసియాకప్‌ మహిళల టీ20 టోర్నీలో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. బంగ్లాదేశ్‌పై తిరుగులేని విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని కేవలం 100/7కే పరిమితం చేసింది. 59 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. సెమీ ఫైనల్‌ వైపు దూసుకెళ్లింది. బంగ్లాలో ఫర్గానా హక్‌ (30), ముర్షిదా ఖాటూన్‌ (21), నిగర్‌ సుల్తానా (36) రాణించారు. మిగతా వాళ్లు ఒక అంకె స్కోరుకు పరిమితం అయ్యారు. బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీ (55; 44 బంతుల్లో 5x4, 2x6), బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన (2-10) షెఫాలీ వర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. స్మృతి మంధాన (47; 38 బంతుల్లో 6x3), జెమీమా రోడ్రిగ్స్‌ (35; 24 బంతుల్లో 4x3) అదరగొట్టారు.




ఈ మ్యాచుకు ముందు టీమ్‌ఇండియా అతి ప్రయోగాలకు పోయి బోల్తా పడింది. పాకిస్థాన్‌ చేతిలో ఓడింది. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్‌ పట్టుదలగా ఆడింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేపట్టింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన దూకుడు ఆడారు. పవర్‌ ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 59 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ అలాగే ధాటిగా ఆడటంతో 10 ఓవర్లకు భారత్‌ 91-0తో నిలిచింది. షెఫాలీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. జట్టు స్కోరు 96 వద్ద స్మృతి, 114 వద్ద షెఫాలీ ఔటయ్యారు. మరికాసేపటికే రిచా ఘోష్‌ (4) పెవిలియన్‌ చేరింది. కిరణ్‌ ప్రభు (0), దీప్తి శర్మ (10) సైతం త్వరగానే ఔటయ్యారు. అయితే జెమీమా అజేయంగా నిలిచి జట్టు స్కోరును 159-5కు చేర్చింది.