ICC T20 World Cup, IND vs PAK: టీమ్‌ఇండియాతో మ్యాచుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థానీ యువపేసర్ షాహిన్ అఫ్రిది అంటున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ సేనపై ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో పోలిస్తే తానిప్పుడు మరింత దృఢంగా ఉన్నానని పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు షాహిన్ అఫ్రిదీ అత్యంత కీలకం! బంతిని చక్కగా స్వింగ్ చేయడమే కాకుండా అత్యంత వేగంగా బంతులు వేస్తాడు. కచ్చితమైన లెంగ్తుల్లో బంతులేసి ప్రత్యర్థుల వికెట్లు పడగొడతాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో షాహిన్ టీమ్‌ఇండియా నడ్డి విరిచాడు. టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టి ఓడించాడు. అలాంటిది ఆసియాకప్ ముంగిట అతడు గాయపడ్డాడు. దాంతో మ్యాచులు ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు.
షాహిన్ లండన్‌లో చికిత్స పొందినప్పటికీ టీ20 ప్రపంచకప్ ఆడటంపై నిన్నటి వరకు సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం అతడు కోలుకున్నాడని తెలిసింది. అతడు అత్యంత ఫిట్‌గా ఉన్నాడని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా మీడియాకు చెప్పాడు. 'నిన్నే షాహిన్ అఫ్రీదితో మాట్లాడాను. గతంలో ఎన్నడూ లేనంత ఫిట్‌నెస్‌తో ఉన్నానని చెప్పాడు. అతడి ప్రోగ్రెస్ చాలా బాగుంది. అతడి డాక్టర్ కొన్ని వీడియోలు పంపించాడు. టీమ్‌ఇండియాతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు అఫ్రీది చెప్పాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు' అని రాజా మీడియాకు చెప్పాడు.
'పాకిస్థాన్‌కు నిజంగా ఇది శుభవార్తే! ఎందుకంటే మోకాలి గాయాలు చాలా సంక్లిష్టమైనవి. అంతేకాకుండా డెలికేట్‌గా ఉంటాయి. అందుకే 110 శాతం ఫిట్‌నెస్ సాధించే వరకు అతడిని ఆడించే రిస్క్ చేయొద్దని అనుకున్నాం. నేనతడితో మాట్లాడినప్పుడు 110 శాతం ఫిట్‌గా ఉన్నట్టు షాహిన్ చెప్పాడు. ఆందోళన అవసరం లేదన్నాడు. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచులు ఆడతానని, టీమ్‌ఇండియా మ్యాచుకు సిద్ధమవుతానని స్పష్టం చేశాడు' అని రాజా వెల్లడించాడు. ఫకర్ జమాన్ సైతం రిహాబిలిటేషన్ పొందుతున్నాడని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీసు ఆడుతోంది. మరోవైపు టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. వాకా స్టేడియంలో శిబిరం ఏర్పాటు చేసుకుంది. రోజూ ప్రాక్టీస్ చేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ జోష్‌లో కనిపిస్తున్నారు.