T20 World Cup 2022: సుమారు వారం రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌ సమరం ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఉత్కంఠభరితంగా సాగనుంది. సొంత గడ్డపై తన టైటిల్‌ను కాపాడుకోవడానికి ఆస్ట్రేలియా చెమటి చిందించనుంది. పొట్టి కప్‌ను కైవసం చేసుకోవడానికి ఇతర జట్లు అంతే స్థాయిలో పోటీకి తగ్గేదేలే అంటున్నాయి. అందుకే ఈసారి ప్రపంచకప్‌ హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న జట్ల బలాబలాలను చూస్తే రెండు టీంలు టీ20 ప్రపంచ కప్ గెలుచుకోవడానికి బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నట్టు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 


టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ జట్టు


భారత జట్టు ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉంది. ఈసారి పొట్టి ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా బలమైన పోటీదారుగా చెప్పొచ్చు. భారత జట్టు ఈ ఏడాది మొత్తం 32 టి 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇతర జట్లు కంటే ఇది చాలా ఎక్కువ. ఈ 32 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా 23 విజయాలు సాధించింది. 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దైంది.  గెలుపు శాతం పరంగా చూస్తే ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టు 74 శాతం మ్యాచ్‌లలో విజయం సాధించింది.


గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఐసిసి ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు ఐదో స్థానంలో  ఉంది. అయినా కేన్ విలియమ్సన్‌ నేతృత్వంలోని జట్టులో చాలా మంది టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. ఒక్క క్షణంలో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా వాళ్లకు ఉంది. ఈ ఏడాది న్యూజిలాండ్ మొత్తం 10 టీ20 మ్యాచ్లు ఆడగా, అందులో తొమ్మిదింట విజయం సాధించి గెలుపు శాతం 90తో ఉంది. 


ఇతర జట్ల పరిస్థితి ఏమిటి?


ఈ రెండు జట్ల తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా పోటీలో ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు మొత్తం 14 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 9 గెలిచి 4 ఓడింది. ఆస్ట్రేలియా గెలుపు శాతం 67గా ఉంది. ఇటీవల భారత్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది.


ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు ఈ ఏడాది ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు శాతం 44.66. ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు ఇంగ్లాండ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 18 టి 20మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ 8 గెలిచింది. అయితే 10 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఈ ఏడాది వారు 44 శాతం మ్యాచ్‌లను గెలుచుకున్నారు.


ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది మొత్తం 13 టీ20 మ్యాచ్‌లలో ఆడి 7 గెలిచి 5 ఓడిందా జట్టు. ఇటీవల భారత్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడిపోయింది. అంటే ఇప్పుడు ఉన్న శాతాలతో చూస్తే భారత్‌, న్యూజిలాండ్‌ మంటి ఆటతీరుతో టాప్‌ ఫామ్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ టీ 20 మ్యాచ్‌లు ఎప్పుడూ స్పాట్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు ఆడిన విధానంపైనే ఆధార పడి ఉంటాయి.