Women's U-19 T20 WC:  మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం (జనవరి 30) రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ ట్రోఫీ సాధించడం ఇదే తొలిసారి. యువ అమ్మాయిలు సాధించిన ఈ ఘనతపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్ గా  నిలిచిన భారత జూనియర్ మహిళల జట్టును పురుషుల టీమిండియా జట్టు అభినందించింది. 


ఇది ఒక గొప్ప విజయం


అండర్- 19 20 ప్రపంచకప్ సాధించిన భారత జూనియర్ మహిళల జట్టును టీమిండియా ప్రత్యేకంగా అభినందించింది. జట్టు ఆటగాళ్లందరూ మహిళా క్రీడాకారిణుల గురించి ప్రత్యేక సందేశాలు ఇచ్చారు. నిన్న న్యూజిలాండ్ తో రెండో టీ20 ముగిశాక భారత జట్టు ఆటగాళ్లు జూనియర్ మహిళల టీంకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది. మొదట భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ అమ్మాయిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మహిళల క్రికెట్ లో ఒక గొప్ప రోజని కితాబిచ్చారు. అనంతరం అండర్- 19 పురుషుల ప్రపంచకప్ విజేత పృథ్వీ షా మాట్లాడాడు. ఇది ఒక గొప్ప విజయమని షా అన్నాడు. అనంతరం జట్టు సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు. 






అండర్- 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేత భారత్


 అమ్మాయిలు అదరగొట్టారు. భారత మహిళల క్రికెట్ లో అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ టోర్నీని ఒడిసిపట్టారు. సీనియర్ అమ్మాయిలు వన్డేల్లో 2 సార్లు, టీ20ల్లో ఒకసారి కప్పు అందుకోవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయారు. అయితే జూనియర్లు మాత్రం ఆ ఒక్క అడుగునూ వేసేశారు. అండర్- 19 మహిళల తొలి టీ20 ప్రపంచకప్ ను సగర్వంగా అందుకున్నారు. ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా జూనియర్ అమ్మాయిలు ఐసీసీ ట్రోఫీని సాధించారు. 


కాలా చష్మా డ్యాన్స్


అండర్- 19 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆనందంలో భారత అండర్- 19 జట్టు సంబరాలు చేసుకుంది. జూనియర్ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. హిందీ సినిమా పాట 'కాలా చష్మా'కు భారత ప్లేయర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఐసీసీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 7 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.