Hockey WC 2023 Winner:  పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో పెనాల్టీ షూటౌట్ లో ఆ జట్టు బెల్జియంను ఓడించింది. టై బ్రేకర్ లో జర్మనీ 5-4 తేడాతో బెల్జియంను ఓడించి కప్ ను అందుకుంది. 


మ్యాచ్ నిర్ణీత సమయానికి 3-3తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. ఆట పదో నిమిషానికి వచ్చేసరికే జర్మనీ 0-2 తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత ఆ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆరంభంలో ఫ్లోరెంట్‌ (9వ నిమిషం), టాన్‌గయ్‌ (10వ నిమిషంలో) గోల్స్‌ చేయటంతో బెల్జియం ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత జర్మనీ పుంజుకుంది. ఆ జట్టు ఆటగాళ్లు  వాలెన్‌ (28వ నిమిషం), గొంజాలో (40వ నిమిషం), మాట్స్‌ (47వ నిమిషం) గోల్స్‌తో 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక జర్మనీదే విజయం అనుకుంటుండగా.. రెండు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా బెల్జియం ఆటగాడు బూన్‌ (58వ) గోల్‌ చేశాడు. దీంతో 3-3తో స్కోర్లు సమమై షూటౌట్‌ కు దారితీసింది. 


షూటౌట్ లో తొలి ప్రయత్నంలో జర్మనీ, బెల్జియం సఫలం కావడంతో స్కోర్లు  4-4తో మళ్లీ సమమయ్యాయి. చివరికి టైబ్రేకర్‌లో మ్యాచ్ జరగడంతో జర్మనీ 5-4తో విజయం సాధించింది. 


 


9వ స్థానంతో ముగించిన భారత్


స్వదేశంలో జరిగిన ఈ హాకీ ప్రపంచకప్‌లో భారత్ 9వ స్థానంలో నిలిచింది. ఈసారి బలంగా కనిపించిన భారత హాకీ జట్టు కప్ గెలుస్తుందని అందరూ భావించారు. అయితే కనీసం క్వార్టర్స్ కూడా చేరలేకపోయింది. ఈ టోర్నీ నుంచి టీమిండియా మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ దూరం కావడం భారత్‌కు పెద్ద దెబ్బ అయింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అటాకింగ్ ప్లేయర్‌కు గాయం అయింది. దీంతో అతను ఏకంగా టోర్నీకే దూరం అయ్యాడు. మొదట కేవలం వేల్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉండబోడని వార్తలు వచ్చాయి. కానీ టోర్నీ నుంచే దూరం కావాల్సి రావడం భారత్ కప్ అవకాశాలను దెబ్బ తీసింది.


టీమిండియా హాకీ టీమ్ లో అటాకింగ్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ కీలక ఆటగాడు. తన అటాకింగ్ గేమ్ తో జట్టుకు చాలాసార్లు ఉపయోగపడేలా ఆడాడు. ఈ మెగా టోర్నీలో స్పెయిన్ పై విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా గా ముగియడంలోనూ హార్దిక్ ది ప్రధాన పాత్ర.


భారత్ చివరిసారిగా 1975లో హాకీ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఈసారి జట్టు పటిష్టంగా ఉండటంతో విజేతగా నిలుస్తుందని అందరూ ఆశించారు. కానీ క్వార్టర్స్‌కు కూడా చేరలేకపోయారు. 1971 వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా, 1973 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 1975 విజయం తర్వాత ఒక్కసారిగా కూడా కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోయింది.