IND vs WI, WT20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు దూసుకెళ్తోంది. ఈ మెగా టోర్నీలో మన అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు. తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ పై విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు.. నేడు విండిస్ పై గెలిచింది. బుధవారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళలు 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
భారత బౌలింగ్ ధాటికి విండీస్ విలవిల
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ మహిళల జట్టు.. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ (2) రెండో ఓవర్లోనే వెనుదిరిగింది. అయితే మరో ఓపెనర్ టేలర్ (42), వన్ డౌన్ బ్యాటర్ క్యాంప్ బెల్లె (30) తో కలిగి ఇన్నింగ్స్ ను నిర్మించింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు. దీంతో 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 77 పరుగులతో ఉన్న ఆ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని క్యాంప్ బెల్ ను ఔట్ చేయడం ద్వారా దీప్తి శర్మ విడదీసింది. తర్వాత విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో చెబియన్ (21), షబికా (15) మాత్రమే రాణించారు. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 118 పరుగులు చేసింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, పూజ వస్త్రాకర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన చెలరేగటంతో 3.3 ఓవర్లలోనే 32 పరుగులు సాధించింది. అయితే తర్వాత పుంజుకున్న విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో భారత్ వరుస వికెట్లు కోల్పోయింది. 11 పరుగుల వ్యవధిలో మంధాన (10), జెమీమా రోడ్రిగ్స్ (1), షెఫాలీ (28) ల వికెట్లు చేజార్చుకుంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 33), రిచా ఘోష్ (32 బంతుల్లో 44) రాణించటంతో 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
దీప్తి రికార్డ్
వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన భారత తొలి మహిళా క్రికెటర్ గా నిలిచింది.
.