ICC Men's Test Rankings:


టీమ్‌ఇండియా 'స్పిన్‌ ట్విన్స్‌' మరోసారి కేక పెట్టించారు! నాగ్‌పుర్‌లో ఆస్ట్రేలియాను కంగారు పెట్టించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఈసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌ దుమ్ము దులిపారు. అన్ని విభాగాల్లో తమ స్థానాలను మెరుగు పర్చుకున్నారు.


నాగ్‌పుర్‌ టెస్టులో యాష్‌, జడ్డూ కలిసి 132 పరుగులే ఇచ్చి 15 వికెట్లు పడగొట్టారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాను 1-0తో ఆధిక్యంలో నిలిపారు. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ కేవలం 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్సులో 3/42తో సత్తా చాటాడు. దాంతో ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలోని ప్యాట్‌ కమిన్స్‌ కన్నా కేవలం 21 రేటింగ్‌ పాయింట్లు వెనకబడ్డాడు.


ఇదే టెస్టులో రవీంద్ర జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తొలి ఇన్నింగ్సులో 5/47తో ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. కీలకమైన స్టీవ్‌స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ను పెవిలియన్‌ పంపించాడు. ఇక రెండో ఇన్సింగ్సులో 2/34తో చెలరేగాడు. యాష్‌తో కలిసి ఆసీస్‌ను 91కే కుప్పకూల్చాడు. అలాగే చక్కని హాఫ్‌ సెంచరీతో మురిపించాడు. దాంతో ఆల్‌రౌండర్ల జాబితాలో 424 రేటింగ్‌తో నంబర్‌ వన్‌కు వెళ్లాడు. ఇదే జాబితాలో యాష్‌ 358 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు.


అద్వితీయమైన సెంచరీతో మురిపించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) పదో స్థానం నుంచి ఎనిమిదికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డ ఇదే పిచ్‌పై అవలీలగా బౌండరీలు బాదేశాడు. ఇదే మ్యాచులో విఫలమైన ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (David Warner), ఉస్మాన్‌ ఖవాజా తక్కువ ర్యాంకులపై పరిమితం అయ్యారు. ఆరు స్థానాలు పడిపోయిన వార్నర్‌ 20లో నిలిచాడు. ఖవాజా 2 ర్యాంకులు తగ్గి 10లో ఉన్నాడు.


టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) సైతం తన ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో ఆరు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకులో నిలిచాడు. నాగ్‌పుర్‌ టెస్టులో భారత్‌ 240/7తో కష్టాల్లో పడ్డ స్థితిలో 84 పరుగులతో ఆదుకున్నాడు. మ్యాచులు ఆడనప్పటికీ తమ విభాగాల్లో రిషభ్ పంత్‌ 7, జస్ప్రీత్‌ బుమ్రా 5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. వన్డేల్లో గిల్‌, విరాట్‌, రోహిత్‌ టాప్‌ 10లో ఉన్నారు. వన్డే బౌలర్ల జాబితాలో మహ్మద్‌ సిరాజ్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.


టెస్టు, వన్డే, టీ20ల్లో టీమ్‌ఇండియా ప్రస్తుతం నంబర్‌ వన్‌ పొజిషన్లో ఉంది.


Shubman Gill:  ఇక టీమిండియా నయా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ 2023 జనవరి నెలకు గాను 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' గా ఎంపికయ్యాడు. ఇటీవల అద్భుత ఫాంలో ఉన్న గిల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. వన్డేలు, టీ20ల్లో శతకాలతో చెలరేగాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసుల్లో కలిపి మొత్తం 567 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 2 సెంచరీలు ఉన్నాయి. 


గతేడాది వన్డేల్లో గిల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో తన తొలి టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ తో గిల్ పొట్టి ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ సిరీస్ లో అనుకున్నంతగా రాణించలేదు. వన్డేల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 3 ఇన్నింగ్సుల్లో 207 పరుగులు చేశాడు. తొలి, మూడో వన్డేల్లో వరుసగా 70, 116 పరుగులు సాధించాడు.