Cheteshwar Pujara:  ఛతేశ్వరా పుజారా... రాహుల్ ద్రవిడ్ తర్వాత నయా వాల్ అని పిలిపించుకున్న ఆటగాడు. టెస్టుల్లో భారత్ కు వెన్నెముకలా నిలుస్తున్న బ్యాటర్. పిచ్ ల్ ఎలా ఉన్నా.. పరిస్థితులు ఏమైనా వికెట్లకు అడ్డంగా గోడలా నిలబడడంలో పుజారా శైలే వేరు. ప్రస్తుతమున్న యువ క్రికెటర్లు టీ20ల వైపు పరిగెడుతుంటే పుజారా మాత్రం టెస్టులే తనకు అత్యుత్తమైనవంటూ చెప్తాడు. గత కొన్నేళ్లలో సుదీర్ఘ ఫార్మాట్ లో టీమిండియాకు ప్రధాన బ్యాటర్ గా మారాడు. కెరీర్ లో ఎత్తు పల్లాలను ఎదుర్కొంటూ నేడు వందో టెస్ట్ ముంగిట నిలిచాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే రెండో టెస్ట్ పుజారాకు 100వ మ్యాచ్. ఈ సందర్భంగా పుజారా తన కెరీర్ లో ఉత్తమ ఇన్నింగ్స్ లను గుర్తు చేసుకున్నాడు.


అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్


2006 లో జరిగిన అండర్- 19 ప్రపంచకప్ తో తొలిసారిగా ఛతేశ్వర్ పుజారా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలకు జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2010లో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడాడు. మొదటి మ్యాచ్ లోనే అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తన కెరీర్ లో ఎన్నోసార్లు పుజారా జట్టుకు విజయాలు అందించే ఇన్నింగ్స్ లు ఆడాడు. జట్టు ఓడిపోకుండా అడ్డు నిలిచాడు. కెరీర్ లో ఎత్తు పల్లాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడ్డాడు. నేడు అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియాపైనే మైలురాయి అనదగ్గ వందో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. 






ద్రవిడ్ సూచనలు పనిచేశాయి


ఈ సందర్బంగా తన కెరీర్ లో ఉత్తమం అనదగ్గ ఇన్నింగ్సులను పుజారా గుర్తుచేసుకున్నాడు. తను టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడు చేసిన 72 పరుగులు తనకెంతో ప్రత్యేకమని పుజారా తెలిపారు. ఆ తర్వాత 2013లో దక్షిణాఫ్రికాలో తన మొదటి సెంచరీ (153) కూడా తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పాడు. ఈ క్రమంలో తన తొలి ఓవర్సీస్ సిరీస్ గురించి పుజారా ఆసక్తికరమైన కథనాన్ని వివరించాడు. 'అప్పుడు దక్షిణాఫ్రికా పర్యటన నా తొలి ఓవర్సీస్ సిరీస్. నేను నెం. 5, 6 లో బ్యాటింగ్ చేశాను. అప్పుడు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ లను ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డాను. వారిద్దరూ అప్పుడు కెరీర్ పీక్స్ లో ఉన్నారు. పేస్ నెమ్మదిగా ఉండే భారత పిచ్ లపై ఆడడం అలవాటైనప్పుడు.. దక్షిణాఫ్రికా పిచ్ లపై ఆడడం కష్టంగా ఉంది. అప్పుడు నేను రాహుల్ ద్రవిడ్ భాయ్ ను సంప్రదించాను. అతను నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. వాటిపై పనిచేశాను. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడల్లా నేను బాగా రాణించాలని, ఆ బౌలర్లపై విజయం సాధించాలని కోరుకున్నాను. ఇది 2013 జోహన్నెస్ బర్గ్ లో జరిగింది.' అని పుజారా తెలిపాడు. 


అలాగే ఆస్ట్రేలియాలో 2018లో అడిలైడ్ లో తను చేసిన 123 పరుగులు, 2020-21లో గబ్బాలో సాధించిన హాఫ్ సెంచరీలు కూడా తన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో ఉంటాయని పుజారా పేర్కొన్నాడు.