Chetan Sharma:


చేతన్ శర్మ..! అరంగేట్రం టెస్టులో తొలి ఓవర్లోనే వికెట్‌ పడగొట్టిన మిస్టరీ పేసర్‌! పాక్‌ గెలుపునకు ఆఖరి బంతికి బౌండరీ అవసరం కాగా జావెద్‌ మియాందాద్‌కు ఫుల్‌టాస్‌ వేసి సిక్సర్‌ ఇచ్చిన వివాదాస్పద బౌలర్‌! వన్డే ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన హిస్టరీ క్రియేటర్‌! ఇప్పుడు జీన్యూస్‌ స్టింగ్‌ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటపెట్టి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకున్న చీఫ్ సెలక్టర్‌! అసలు ఎవరీయన!


రికార్డుల బౌలర్‌


టీమ్‌ఇండియాకు తొలి ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌. ఆయన మెంటార్‌ దేశ్ ప్రేమ్‌ ఆజాద్‌. ఆయన శిష్యుడే చేతన్ శర్మ. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యశ్‌పాల్‌ శర్మకు అల్లుడి వరస! 1966, జనవరి 3న చేతన్‌ జన్మించారు. పంజాబ్‌ తరఫున 17 ఏళ్లకే రంజీ క్రికెట్లో అరంగేట్రం చేశారు. మరుసటి ఏడాదే భారత్‌కు వన్డేల్లో ఎంపికయ్యారు. 1984లో టెస్టుల్లో అరంగేట్రం చేశారు. పాకిస్థాన్‌ బ్యాటర్‌ మొహిసిన్ ఖాన్‌ను ఐదో బంతికే ఔట్‌ చేశారు. తొలి ఓవర్లోనే వికెట్‌ తీసిన మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఇక 1985లో శ్రీలంకపై మూడు టెస్టుల్లో 14 వికెట్లతో సంచలనం సృష్టించారు. ఇంగ్లాండ్‌ను 2-0తో ఓడించిన ప్రతిష్ఠాత్మక సిరీసులో 16 వికెట్లు తీశారు. బర్మింగ్‌హామ్‌లో కెరీర్‌ బెస్ట్‌ 6/58 సహా 10 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్‌లో పది వికెట్ల ఘనత ఇప్పటికీ ఆయనదే.


బ్యాటుతోనూ భళా!


చేతన్‌ శర్మ 1987 రిలయన్స్‌ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్‌ అందుకున్నారు. కెన్‌ రూథర్‌ఫర్డ్‌, ఇయాన్‌ స్మిత్‌, ఎవిన్‌ ఛాట్‌ఫీల్డ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపించారు. బంతితోనే కాకుండా బ్యాటుతోనూ ఆకట్టుకున్నారు. 1989 నెహ్రూకప్‌లో ఇంగ్లాండ్‌పై మూడో స్థానంలో దిగి 256 లక్ష్యాన్ని ఛేదించారు. 96 బంతుల్లో 101 నాటౌట్‌గా నిలిచారు. ఆ తర్వాతి మ్యాచులోనే ఆసీస్‌పై మనోజ్‌ ప్రభాకర్‌తో కలిసి 40 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించారు. కపిల్‌ దేవ్‌ తర్వాత మంచి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించారు. ఆ తర్వాత బౌలింగ్‌లో పస తగ్గడంతో జట్టులో చోటు కోల్పోయారు. మొత్తంగా 23 టెస్టుల్లో 396 పరుగులు, 61 వికెట్లు పడగొట్టారు. 65 వన్డేల్లో 456 రన్స్‌, 67 వికెట్లు తీశారు. దేశవాళీ క్రికెట్లోనూ మంచి గణాంకాలే ఉన్నాయి.



కామెంటేటర్‌ - పొలిటీషియన్‌ - చీఫ్‌ సెలక్టర్‌


క్రికెట్‌కు వీడ్కోలు పలికాక చేతన్ శర్మ కామెంటరీ చేశారు. పంచకులలో 2004-09 వరకు ఫాస్ట్‌ బౌలింగ్‌ అకాడమీ నిర్వహించారు. 2009లో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. పార్టీ స్పోర్ట్స్‌ సెల్‌ కన్వీనర్‌గా నియమితులయ్యారు. 2020లో చేతన్‌ టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్‌ పదవికి ఎంపికయ్యారు. ఇది భారత క్రికెట్లోనే ఒక డిఫికల్ట్‌ ఫేజ్‌ అనొచ్చు! ఒక వైపు కరోనా వేధించింది. మ్యాచులు తగ్గాయి. ఆటగాళ్ల ఎంపిక సంక్లిష్టంగా మారింది. సంజూ శాంసన్‌, ఇతర యువ క్రికెటర్ల ఎంపికల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రెండు టీ20 ప్రపంచకప్‌లు ఓడిపోవడంతో 2022లో ఆయనపై బీసీసీఐ వేటు వేసింది. మళ్లీ నోటిఫికేషన్‌ వేసి, ఇంటర్వ్యూ చేసి విచిత్రంగా ఆయన్నే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుత స్టింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో ఆయన కెరీర్‌ సందిగ్ధంగా మారింది.