బీసీసీఐలో భూకంపం వచ్చింది. చేతన్ శర్మ ఓ మీడియా స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పిన విషయాలు ఇండియన్ క్రికెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ కోసం  డ్రగ్స్ తీసుకుంటారని ఎగ్జాంపుల్స్‌తో వివరించారాయన. అంతే కాదు జట్టులో, మేనేజ్‌మెంట్‌లో ఉన్న లుకలుకలను కూడా పూస గుచ్చినట్టు చెప్పిన సంగతులు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. 


బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ ఇండియన్ క్రికెట్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఓ మీడియా హౌస్‌ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కి చేసిన ఆరోపణలు క్రిడాలోకం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఫిట్‌నెస్‌ సాధించడానికి క్రికెటర్లు ఇంజెక్షన్‌లు తీసుకుంటారనే సంచలన విషయాలు బయటపెట్టారు. వాళ్లు తీసుకునే ఇంజక్షన్లు డోపింగ్ టెస్టుల్లో కూడా దొరకవని తెలిపారు. చాలా మంది పూర్తిగా ఫిట్‌నెస్‌ లేకపోయినా మ్యాచ్‌కు ముందు ఇంజక్షన్‌లు తీసుకుంటారని తెలిపారు. 80 శాతం ఫిట్‌గా ఉన్నవాళ్లు కూడా ఈ మెడిసిన్ తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తారని వివరించారు. ఇలా చాలా మంది మ్యాచ్‌లు ఆడుతున్నారన్నారు. 


ఇంజక్షన్‌లు తీసుకొని మ్యాచ్‌లు ఆడుతారనే దానికి ఎగ్జాంపుల్స్‌ కూడా చేతన్ శర్మ వివరించారు. ఫేక్‌ఫిట్‌నెస్‌ గేమ్‌లో చాలా బడా క్రికెటర్లు ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కిందకు వంగలేని ఓస్టార్‌ ప్లేయర్‌ కూడా ఇలానే ఫిట్‌నెస్‌ సాదించాడని స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పుకొచ్చాడు. 


జస్ప్రీత్‌ బుమ్రా గాయంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన చేతన్ శర్మ... టీ 20 వరల్డ్ కప్‌కి ముందు బుమ్రా ఫిట్‌గా లేడని...అయినా ఆడించారన్నారు. అయినా మ్యాచ్లు ఆడించారన్నారు. మరో మ్యాచ్ ఆడి ఉంటే మాత్రం బుమ్రా ఏడాది పాటు ఆటకు దూరమయ్యేవారన్నారు. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో ఆడొచ్చన్నారు. 


గంగూలి, కొహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలపై కూడా నోరు విప్పారు చేతన్ శర్మ. గంగూలీ, కోహ్లీకి అసలు పడదని తెలిపారు. తనను కెప్టెన్‌గా తప్పించడంలో ఆయన పాత్ర చాలా ఉందని భావించిన కోహ్లీ... ఆ పేరు వింటేనే మండిపడతారన్నారు. ఓ సెలెక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్‌పై పునరాలోచించాలని గంగూలి చెప్పి ఉంటాడని.. అందుకు కోహ్లీ కుదరదని చెప్పి ఉంటారని చేతన్ తెలిపారు. తనను తప్పించడంపై కోహ్లీ ఓ ప్రెస్‌మీట్‌ పెట్టాలని భావించినప్పటికీ ఎందుకో ఆ పని చేయలేదన్నారు. అయినా... తనను గంటన్నర ముందే కెప్టెన్సీ నుంచి తప్పించారని 2021 దక్షిణాఫ్రికా పర్యటనలో చెప్పిన సంగతి గుర్తు చేశారు. మొదటి నుంచి కోహ్లీ తీరు గంగూలీకి నచ్చదని... సమయం కోసం చూసిన దాదా... రోహిత్ శర్మకు ఓటు వేశారన్నారు.  


రోహిత్‌ శర్మ, కోహ్లీ మధ్య ఇగో క్లాష్‌ ఉందన్నారు చేతన్ శర్మ. ఒకరు రోహిత్‌ అమితాబ్‌, కోహ్లీ ధర్మేంద్రలా ఫీల్ అవుతారన్నారు. జట్టులో విరాట్‌, రోహిత్ వర్గాలు ఉండేవన్నారు. కోహ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం రోహిత్ అండగా ఉన్నాడని వివరించారు. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే విరాట్, రోహిత్ నుంచి టీ 20 ఫార్మాట్‌ నుంచి తప్పించినట్టు తెలిపారు చేతన్‌ శర్మ. ఇక భవిష్యత్‌లో కూడా వీళ్లకు అవకాశాలు రాకోపవచ్చని కూడా కుండబద్దలు కొట్టారు.