Kohli vs Ganguly:
విరాట్ కోహ్లీ (Virat Kohli Captaincy) నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొనేటప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఆపేందుకు ప్రయత్నించాడని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే అబద్దం చెప్పాడని అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో దాదా తప్పేమీ లేదన్నారు. జీన్యూస్ స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
టీమ్‌ఇండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 2021 చివర్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతకు ముందు రెండేళ్లుగా ఫామ్ కోల్పోవడం, పరుగులు చేయకపోవడంతో అతడి నాయకత్వంపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లోనూ ఘోర పరాజయం పాలవ్వడంతో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తాను టీ20 కెప్టెన్సీ వదిలేస్తానని విరాట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగాలనుకుంటున్నట్టు చెప్పాడు. చివరికి బీసీసీఐ అతడిని టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. మరికొన్ని రోజులకు సుదీర్ఘ ఫార్మాట్‌కూ అతడే దూరమయ్యాడు. అయితే దక్షిణాఫ్రికా సిరీసు ప్రెస్‌మీట్, కెప్టెన్సీ వదిలేయడానికి మధ్య ఏం జరిగిందో చేతన్ శర్మ వివరించారు.
'ఆటగాడికీ బీసీసీఐ అధ్యక్షుడికి మధ్య వివాదాలు రావడం మంచిది కాదు! ఎందుకంటే అది బోర్డు వర్సెస్ ఆటగాడిగా మారుతుంది. ఇందులో తప్పెవరిదో తర్వాత సంగతి. కానీ అది నేరుగా బీసీసీఐపై దాడి చేసినట్టే అవుతుంది. అందుకే ఇలాంటి బోర్డుతో వివాదాల వల్ల ఆటగాళ్లకే నష్టమని అందరికీ హెచ్చరిస్తారు' అని చేతన్ శర్మ అన్నారు.
'బీసీసీఐ అధ్యక్షుడి వల్లే తనకు కెప్టెన్సీ దూరమైందని విరాట్ కోహ్లీ భావించాడు. సెలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌లో మొత్తం 9 మంది ఉన్నారు. కెప్టెన్సీపై మరోసారి ఆలోచించుకోవాలని దాదా చెప్పుంటాడు. కానీ విరాట్ వినలేదేమో. నేను, సెలక్టర్లు, బీసీసీఐ అధికారులు మొత్తం తొమ్మిది మంది అక్కడే ఉన్నాం. కోహ్లీ అసలు గంగూలీ మాట విన్లేదు' అని చేతన్ శర్మ పేర్కొన్నారు.
'దక్షిణాఫ్రికాకు బయల్దేరే ముందు జట్టు గురించే మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. అందులోకి కెప్టెన్సీ అంశాన్ని కోహ్లీ ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసుండొచ్చు. నిజం ఏంటంటే విరాట్ అబద్దం చెప్పాడు. మరోసారి ఆలోచించుకోవాలని గంగూలీ కచ్చితంగా చెప్పాడు. అసలు కోహ్లీ ఎందుకు అబద్దమాడాడో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇది బోర్డు వర్సెస్ ఆటగాడి వివాదంగా మారిపోయింది. బహుశా తను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ చేజార్చుకోవడానికి దాదాదే కీలక పాత్రగా అతడు భావించి ఉండొచ్చు' అని చేతన్ స్పష్టం చేశారు.