Hardik Natasa Wedding:  టీమిండియా టీ20 కెప్టెన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య- నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ ల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగింది. వీరిద్దరూ ఇదివరకే చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబం, సన్నిహితుల మధ్య క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మళ్లీ ఒక్కటయ్యారు. వీరిద్దరికీ అగస్త్య అనే బాబు ఉన్నాడు. 


భారత ఆటగాడు హార్దిక్ పాండ్య, నటాషాలు గతేడాది చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2020 మే, 31న తాము వివాహం చేసుకున్నట్లు వీరిరువురూ ప్రకటించారు. జూలై 2020లో నటాషా అగస్త్యకు జన్మనిచ్చారు. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇందుకు ఉదయ్ పూర్ ను వేదికగా ఎంచుకున్నారు. పెళ్లికి ముందు వారి సన్నిహితులు ఇలా చెప్పారు.  'అప్పట్లో వారు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అంతా హడావిడిగా జరిగిపోయింది. తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వారికి ఎప్పట్నుంచో కోరిక ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు' అని వారు తెలిపారు. 


హార్దిక్ పాండ్య తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. మూడేళ్ళ క్రితం మేము చేసుకున్న ప్రతిజ్ఞలను పునరుద్ధరించుకున్నాం. వివాహం ద్వారా ఈ ప్రేమ ద్వీపంలో ప్రేమికుల రోజును ఇలా జరుపుకున్నాం. ఈ సమయంలో మా కుటుంబం, స్నేహితులు మాతో ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం అని పాండ్య అన్నాడు. 






 


పునరాగమనం సూపర్


గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు అరంగేట్రంలోనే కెప్టెన్ గా ట్రోఫీని అందించాడు. అలాగే భారత జట్టులోనూ రాణిస్తున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో ఐర్లాండ్, న్యూజిలాండ్ లతో టీ20 సిరీస్ లకు ప్రాతినిధ్యం వహించి జట్టును సిరీస్ విజేతగా నిలిపాడు. పాండ్య కెప్టెన్సీలో శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ ను 3-0తో భారత్ గెలుచుకుంది. 


కెప్టెన్ గా, ఆటగాడిగా హార్దిక్ పాండ్య ప్రదర్శనను బట్టి చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ తర్వాతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా బీసీసీఐ సూచనలు ఇచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టీ20లకు ఇకనుంచి పాండ్యనే రెగ్యులర్ కెప్టెన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. సొంతగడ్డపై కప్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగనుంది.