WPL 2023:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ వేలం ఫిబ్రవరి 13న ముగిసింది. 5 ఫ్రాంచైజీ జట్లు 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 4 నుంచి 26 వరకు ఈ సీజన్ జరుగుతుంది. గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. 


డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) తొలి సీజన్ మార్చి 4న ప్రారంభం కానుంది. ఫైనల్ మార్చి 26న జరుగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. 20 లీగ్ మ్యాచ్ లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. ముంబయిలోని 2 స్టేడియాలలో మాత్రమే మొత్తం మ్యాచ్ లు జరగనున్నాయి. ఆటగాళ్లు ప్రయాణించడానికి వీలుగా డీవై పాటిల్, బ్రబౌర్న్ మైదానాలను మాత్రమే ఎంపికచేశారు. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 7.30 వరకు జరుగుతాయి. 


డబ్ల్యూపీఎల్ జరిగే తీరిది



  • టోర్నీలో మొత్తం 5 జట్లు పాల్గొంటాయి.

  • ప్రతి జట్టు ఇంకో జట్టుతో 2 సార్లు తలపడుతుంది. 

  • పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. 

  • 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు రెండో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. 

  • మార్చి 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

  • మొత్తం 4 డబుల్ హెడర్ మ్యాచ్ లు ఉన్నాయి. లీగ్ దశలో మార్చి 17, 19 తేదీల్లో ఎలాంటి మ్యాచ్ లు లేవు. 






డబ్ల్యూపీఎల్ లో పాల్గొనే జట్లు



  • ముంబయి ఇండియన్స్

  • ఢిల్లీ క్యాపిటల్స్

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

  • గుజరాత్ జెయింట్స్

  • యూపీ వారియర్స్


డబ్ల్యూపీఎల్ వేలం


మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిసింది. స్మృతి మంథాన, యాష్లే గార్డ్‌నర్, నటాలీ స్కీవర్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ప్లేయర్ల కోసం జట్లు చాలా డబ్బు ఖర్చు చేశాయి. స్మృతి మంధాన అత్యధికంగా 3.4 కోట్లు దక్కించుకుంది. 


మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత జట్టు ఓపెనర్ స్మృతి మంథన అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. రూ.3.40 కోట్ల భారీ మొత్తానికి స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంతకం చేసింది. స్మృతి మంథన కోసం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. కానీ చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది.