Women's IPL 2023: మహిళల ఐపీఎల్‌కు (WIPL) సంబంధించి బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని సమాచారం. తుది జట్టులో ఐదుగురు విదేశీ క్రికెటర్లకు అనుమతించాలని భావిస్తోంది. 2023 మార్చిలో టోర్నీ నిర్వహిస్తారని తెలిసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ముగిశాక, పురుషుల ఐపీఎల్ ముందు టోర్నీ జరుగుతుంది.
ప్రస్తుతం పురుషుల ఐపీఎల్‌లో తుది జట్టులో గరిష్ఠంగా నలుగురు విదేశీయులకు చోటు ఉంటుంది. మహిళల జట్టులోనూ ఇదే అనుసరించనున్నారు. శాశ్వత దేశాల నుంచి నలుగురు విదేశీయులు, అసోసియేట్ సభ్య దేశం నుంచి ఒక్కరు జట్టులో చోటు దక్కించుకుంటారు. మొత్తంగా ఒక్కో జట్టులో 18 మంది క్రికెటర్లు ఉండొచ్చు. ఆరుగురు విదేశీ అమ్మాయిలను తీసుకోవచ్చు.
ఇప్పుడున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలే అమ్మాయిల జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అయితే జోన్ల వారీగా ఫ్రాంచైజీలను విక్రయించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలిసింది. నార్త్ (ధర్మశాల/జమ్ము), సౌథ్ (కోచి/వైజాగ్), సెంట్రల్ (ఇండోర్/రాయ్‌పుర్/నాగ్‌పుర్), ఈస్ట్ (రాంచీ/కటక్), నార్త్ ఈస్ట్ (గువాహటి), వెస్ట్ (పుణె/రాజ్‌కోట్) ప్రాతిపదికన జట్లను విక్రయించే అవకాశం ఉంది. కాగా పురుషుల ఐపీఎల్ వేదికల్లో మొదట ఈ మ్యాచులు జరగవు. రెండో దశలో అహ్మదాబాద్, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఉండొచ్చు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పురుషుల మాదిరిగానే మహిళలు ప్రతి జట్టుతో రెండుసార్లు తలపడతారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. టోర్నీని మొదట్లో పరిమిత వేదికల్లో ఒకటి లేదా రెండు స్టేడియాల్లో నిర్వహించొచ్చు. ఆ తర్వాత మరో వేదికకు మార్చొచ్చు. కొవిడ్ కారణంగా 2021లో పురుషుల ఐపీఎల్‌ను మొదట భారత్‌లో నిర్వహించి, మిగిలిన మ్యాచులను యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే.
అరంగేట్రం సీజన్లో ఐదు జట్లు, 20 లీగ్ మ్యాచులు, రెండు వేదికలు ఉండేలా చూస్తారు. అంటే 2023లో రెండు వేదికలు, 2024లో మరో రెండు, 2025లో ఒకటి, 2023నాటి మరో వేదికలో నిర్వహిస్తారు. ఐపీఎల్ ఛైర్ పర్సన్, బీసీసీఐ పాలకులు, ఐపీఎల్ పాలక మండలి కలిసి షెడ్యూలు, ఇతర అంశాలపై తుది నిర్ణయం ప్రకటిస్తారు.
Also Read: అయ్యో దాదా! తెరవెనుక కుట్రకు బలి - నమ్ముకున్నోళ్లే ముంచేశారా?