Sourav Ganguly: సంక్లిష్ట సమయాల్లో నాయకుడిగా ఎంపికవ్వడం.. స్వయం కృషితో శిఖరాగ్రాలకు చేరుకోవడం.. చివరికి నమ్ముకున్నోళ్ల చేతుల్లోనే వెన్నుపోటుకు గురవ్వడం! టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి విధిరాతగా మారింది! ఒకప్పుడు ఆటగాడిగా తెచ్చిపెట్టుకున్న గ్రెగ్‌ చాఫెల్‌ చేతిలో దెబ్బతిన్నాడు! ఇప్పుడు పాలకుడిగా అందలం ఎక్కించిన వారి చేతిలోనే బలయ్యాడు! కర్ణుడి తరహాలో దాదా నిష్క్రమణ వెనక కారణాలెన్నో!! కనిపించని శత్రువులు ఎందరో!!


తొలి ఆటగాడు


బీసీసీఐ, రాజకీయాలు కవల పిల్లలు! ఒకటి లేకుండా మరోటి ఉండదు! ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డును తమ చేతుల్లోనే ఉంచుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ ఆశిస్తుంది. తమ ప్రతినిధులనే అందలం ఎక్కిస్తుంది. ఒకప్పుడు బోర్డు పాలక మండలిలో ఆటగాళ్లకు ప్రాధాన్యం ఉండేదే కాదు. అప్పుడెప్పుడో సునిల్‌ గావస్కర్‌ తాత్కాలికంగా బోర్డు బాధ్యతలు స్వీకరించాడు. 2019లో సౌరవ్‌ గంగూలీ ఈ సంప్రదాయాన్ని తిరగరాశాడు. పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అసలు అతడి ఎంపికే ఓ సంచలనం! రాత్రికి రాత్రే అంచనాలు తలకిందులయ్యాయి. బెంగాల్‌ రాజకీయాలు, ఎన్నికలు దాదా అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు కారణాలుగా మారాయి.


సంధి దశలో పాలన


దాదా అధ్యక్షుడిగా ఎంపికవ్వడానికి ముందు వరకు సుప్రీం కోర్టు నియమించిన పాలక మండలి బాధ్యతలు తీసుకుంది. తాత్కాలిక పాలక మండలి ఉన్నప్పటికీ అన్ని అధికారాలు కోర్టు నియమించిన అధికారులకే ఉండేవి. బీసీసీఐ నూతన రాజ్యాంగం, జస్టిస్‌ లోధా సంస్కరణకు ఆమోదం పలకడంతో బోర్డులో కొత్త అధ్యాయం మొదలైంది. వార్షిక సమావేశంలో ఈస్ట్‌ జోన్‌ నుంచి సౌరవ్‌ గంగూలీ అధ్యక్షుడు అయ్యాడు. వెస్ట్‌ జోన్‌ నుంచి అమిత్‌ షా కుమారుడు జే షా కార్యదర్శిగా ఎంపికయ్యాడు. మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారి అయ్యాడు. మొత్తానికి బీజేపీ మద్దతున్న వాళ్లే బోర్డును అధీనంలోకి తీసుకున్నారు.


జేషా పైనే ఫోకస్‌
 
మూడేళ్లుగా బీసీసీఐలో ఎన్నో మార్పులు వచ్చాయి. సౌరవ్‌ గంగూలీ, జే షా కలిసి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాదా తనదైన శైలిలో పనిచేస్తూనే ఎక్కువగా జేషాను ఫోకస్‌ చేశాడు. ప్రతి ప్రెస్‌నోట్‌ అతడి పేరుతోనే వచ్చేది. వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా కలిసి పనిచేశారు. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో గంగూలీకి చుక్కెదురైంది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలన్న అతడి కోరిక నెరవేరలేదు. నమ్ముకున్నోళ్లు, శత్రువులు, సంప్రదాయాలు అతడికి అడ్డంకిగా మారాయి. ఇటు జే షా, కేంద్ర మంత్రులు, బీజేపీ; అటు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యమంత్రి దాదాను సైడ్‌ చేసేశారని తెలిసింది. రెండు నెలల క్రితమే ఈ పని మొదలైందని సమాచారం.


గమనించని దాదా!


రెండు నెలల నుంచే దాదాను పక్కన పెట్టేస్తున్న సిగ్నల్స్‌ కనిపించాయి. కీలకమైన సమావేశాలు, నిర్ణయాల్లో జే షానే కీలక పాత్ర పోషిస్తున్నాడు. గంగూలీని పట్టించుకోలేదు. బోర్డు, ఏజీఎం విషయాలను రోజువారీగా తెలుసుకుంటున్నా దాదా తన వెనుక జరుగుతున్న రాజకీయ కుట్రను మాత్రం గమనించలేకపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. బెంగాల్‌ ఎన్నికల సమయంలో అతడు న్యూట్రల్‌గా కనిపించడం, తమకు సాయపడకపోవడం బీజేపీకి నచ్చలేదని తెలిసింది. ఇప్పుడు ఎంపిక కాబోతున్న వారు ఏ పొజిషన్‌కు నామినేషన్‌ వేయాలో ఈశాన్య రాష్ట్ర సీఎం చెప్పేశారట. బోర్డులో ఇప్పటి వరకు ఎవ్వరూ వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా చేయలేదు. ఇదో అప్రకటిత సంప్రదాయం.




శ్రీనివాసన్‌ ప్రతీకారం!


ఇక బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ ప్రతీకారం, అవమానం మరో కారణం! 2015లో అతడు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అతడి అనుచరుడు సంజయ్‌ పటేల్‌ను అనురాగ్‌ ఠాకూర్‌ ఒక ఓటుతో ఓడించి కార్యదర్శిగా ఎంపికయ్యాడు. 2019లో బ్రిజేష్‌ పటేల్‌ను బోర్డు ప్రెసిడెంట్‌గా చేసేందుకు శ్రీని కృషి చేశాడు. దాదాపుగా కూర్చోబెట్టేశాడు. కానీ రాత్రికి రాత్రే పరిణామాలు మారి దాదా ఎంపికయ్యాడు. శ్రీని, పటేల్‌ ఇద్దరి వయసూ 70 దాటేసింది. వారిక పోటీ చేయలేరు. దీనిని అవమానంగా భావించిన శ్రీనివాసన్‌ ఓ కేంద్ర మంత్రితో కలిసి ఇప్పుడు చక్రం తిప్పాడని సమాచారం. సౌథ్‌ జోన్‌ నుంచి కర్ణాటక తరఫున రోజర్‌ బిన్నీని తెరపైకి తెచ్చాడు. అంతే కాకుండా గంగూలీ అసలేం పని చేయలేదని వాదించాడట. చివరికి దాదాకు అటు బీజేపీ, కాంగ్రెస్‌, రాష్ట్ర సంఘాల నుంచి అండగా ఎవరూ నిలవలేదు. సన్నిహితుడిగా భావించిన జే షా సైతం అవసరమైన సమయంలో సైలెంట్‌గా ఉండిపోయాడు.


దాదా నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి?


తెర వెనుక రాజకీయాల వల్ల బీసీసీఐతో గంగూలీకి బంధం తెగిపోయినట్టే! బహుశా ఐసీసీలో భారత ప్రతినిధి, ఐసీసీ ఛైర్మన్‌గానూ అతడికి బోర్డు మద్దతు ఇవ్వబోదని తెలిసింది. అంటే దాదాపుగా క్రికెట్‌ పాలనతో అతడికి సంబంధాలు తెగినట్టే. కానీ అతడి తర్వాతి స్టెప్‌ ఏంటన్నదానిపై ఆసక్తి నెలకొంది. బహుశా మళ్లీ కామెంటేటర్‌గా వెళ్లొచ్చు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌గా రావొచ్చు. డీసీ యజమాని పార్థ్‌ జిందాల్‌, దాదా అత్యంత సన్నిహితులు. ఇవే కాకుండా తన వ్యాపారాలు, ఒప్పందాలు ఉండనే ఉన్నాయి. ఏదేమైనా రాజకీయ చదరంగంలో గంగూలీ ఒక పావుగా మారాడన్నది సత్యం! ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అతడు ఒంటరి వాడైయ్యాడని, ఎంతో నైరాశ్యంతో బయటకు వచ్చేశాడని సన్నిహితులు వాపోయారు.