Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్-డి మ్యాచ్లో ఇద్దరు ఐపీఎల్ స్టార్లు తలపడ్డారు. సౌరాష్ట్ర, బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకోవడానికి ఎదురెదురు పడ్డారు. ఆ టైంలో ఇద్దరు అంపైర్లు, కృనాల్ పాండ్యా జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 




సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ బ్యాటింగ్‌ సిద్ధమవ్వడంలో చాలా ఆలస్యం అయింది. దీనిపై బరోడా కెప్టెన్ అంబటి రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని గురించి అంపైర్‌ను ప్రశ్నించాడు. తన అసంతృప్తిని ప్రదర్శించాడు. ఇది విన్న షెల్డన్ జాక్సన్  అంబటిరాయుడు మీదికి వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. ఒకరినొకరు దగ్గరిగా వచ్చేశారు. ఇంతలో కృనాల్ పాండ్యా పరిగెత్తుకుంటూ వచ్చి కెప్టెన్ అంబటి రాయుడును పక్కకు తీసుకెళ్లాడు. మరో ఫీల్డర్‌ షెల్డన్ తిరిగి క్రీజులోకి తీసుకెళ్లాడు. ఇంతలో అంపైర్లు బరోడా కెప్టెన్ రాయుడుకు ఏదో చెప్పడం స్క్రీన్‌పై కనిపించింది. 


ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. మితేష్ పటేల్, విష్ణు సోలంకి హాఫ్ సెంచరీలు చేశారు. అదే సమయంలో కెప్టెన్ అంబటి రాయుడు తొలి బంతికే ఉనద్కట్ కు వికెట్ సమర్పించాడు. 



అనంతరం బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో సమర్థ్‌ వ్యానస్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో 52 బంతుల్లో  97 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందించాడు. చతేశ్వర్ పుజారా కూడా సౌరాష్ట్ర నుంచి ఆడి 18 బంతుల్లో 14 పరుగులు చేసి కృనాల్ పాండ్యాకు వికెట్‌ సమర్పించుకున్నాడు.