T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కొన్ని నిబంధనలు అత్యంత కీలకంగా మారనున్నాయి. వాస్తవంగా అక్టోబర్ 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. మెగా టోర్నీ నేపథ్యంలో ఎక్కువ ప్రచారం లభిస్తోంది. పొట్టి ఫార్మాట్ అంటేనే చిన్న చిన్న మార్జిన్లతో గెలుపోటములు మారిపోతుంటాయి. క్షణాల్లో విజయం ఒకవైపు నుంచి మరోవైపునకు మారిపోతుంది. ఇప్పుడు చర్చించబోయే ఐదు నిబంధనలతో టీ20 ప్రపంచకప్ మరింత రసవత్తరంగా సాగనుంది.
మన్కడ్ కాదు రనౌటే!
తమకు నచ్చని నిబంధనలను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తుంటారు ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు! బౌలర్ బంతిని రిలీజ్ చేయకముందే క్రీజు దాటేసి సగం పిచ్ వరకు వెళ్తారు. ఒకవేళ అశ్విన్ లాంటి బౌలర్లు వికెట్లను గిరాటేస్తే క్రీడాస్ఫూర్తిని ప్రశ్నిస్తుంటారు! ఐసీసీ ఇప్పుడీ నిబంధనను చట్టబద్ధం చేసింది. బౌలర్ బంతిని రిలీజ్ చేయకముందే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటేస్తే.. బౌలర్ బంతిని వికెట్లకు గిరాటేస్తే ఇప్పుడు రనౌట్‌గా ప్రకటిస్తారు. అందుకే ఆంగ్లేయులు, కంగారూలు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
లేటైతే ఫీల్డర్ త్యాగం!
టీ20 ప్రపంచకప్‌పై తీవ్ర ప్రభావం చూపించే రూల్ ఇది! ఇకపై ఫీల్డింగ్ జట్టు నిర్దేశిత సమయంలో ఓవర్లను వేయకపోతే మిగిలిన ఓవర్లు మొత్తం ఒక అదనపు ఫీల్డర్‌ను అంతర్‌వృత్తంలో మోహరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఆసియాకప్‌లోనే అమలు చేశారు. టీమ్‌ఇండియాతో మొదటి మ్యాచులో పాక్ త్వరగా ఓవర్లు వేయకపోవడంతో డెత్ ఓవర్లలో ఒక ఫీల్డర్‌ను అంతర్ వృత్తంలో పెట్టాల్సి వచ్చింది. ఫీల్డింగ్ జట్టుకు ఇది డేంజర్‌గా మారే అవకాశం ఉంది.
స్ట్రైకింగ్‌కే రావాలి!
గతంలో బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే క్రీజు దాటితో నాన్‌స్ట్రైకర్ క్రీజులోకి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడలా కాదు. క్రీజు దాటినా, దాటకపోయినా స్ట్రైకర్ క్యాచ్ అవుటైతే కొత్తగా వచ్చే వాళ్లు స్ట్రైక్ చేయాల్సిందే. ఉదాహరణకు నాన్ స్ట్రైక్‌ర్ మంచి హిట్టర్ అయ్యుండి కొత్తగా వచ్చిన ఆటగాడు బౌలర్ అయితే గెలుపోటములు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే టీ20 క్రికెట్లో ఆడే ప్రతి బంతీ ఎంతో విలువైందే.
ఫీల్డర్లు కదలొద్దు!
ఫీల్డింగ్ జట్టు ఆటగాళ్లు బౌలర్ బంతి వేస్తున్నప్పుడు అనవసరంగా కదిలితే పెనాల్టీ పడుతుంది. ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు రివార్డుగా ఇస్తారు. దీనికి తోడు ఆ డెలివరీని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. స్ట్రైకర్ షాట్‌ను అనుసరించి ఫీల్డర్లు ముందుగానే కదిలితే తప్పేం లేదు. ఉదాహరణకు స్ట్రైకర్ స్వీప్ ఆడేందుకు లెగ్‌సైడ్ కదిలితే అటువైపు ఉన్న ఫీల్డర్లు బంతి వస్తుందని కదిలితే పెనాల్టీ ఉండదు.
పిచ్ దాటితే డెడ్ బాల్!
బ్యాటర్లు ఇకపై పిచ్‌లోనే ఉండాలి. తమ దేహంలో కొంత భాగం గానీ, బ్యాటులో కొంత భాగం కానీ ఉండాలి. లేదంటే ఆ బంతిని అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. ఒకవేళ బ్యాటర్లు కచ్చితంగా పిచ్‌ను వదిలేసే పరిస్థితి వస్తే నో బాల్ ఇస్తారు. సాధారణంగా బ్యాటర్లను నిలువరించేందుకు బౌలర్లు భిన్నమైన వైవిధ్యంతో కూడిన బంతులు వేస్తారు. ఇలాంటివి ఆడేందుకు బ్యాటర్ పిచ్ దాటితే డెడ్ బాల్ ఇస్తారు. పరిస్థితిని బట్టి నోబాల్ ప్రకటించి ఫ్రీహిట్ ఇస్తారు.