Mohammed Siraj Wins Man of the series: దిల్లీ పిచ్ పేసర్లకు సహరించలేదని టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. కొత్త బంతి ఏ మాత్రం స్వింగ్ అవ్వలేదని పేర్కొన్నాడు. దాంతో వ్యూహం మార్చాల్సి వచ్చిందని వెల్లడించాడు. బౌన్సర్లు వేసి వికెట్లు పడగొట్టానని తెలిపాడు. దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో సిరీస్ గెలిచాక అతడు మీడియాతో మాట్లాడాడు.
సఫారీ వన్డే సిరీసులో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తం 23 ఓవర్లు విసిరి 20.80 సగటుతో 5 వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మూడో వన్డేలో బంతి స్వింగ్ అవ్వనప్పటికీ రెజా హెండ్రిక్స్, జానెమన్ మలన్‌ను ఔట్ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.
'అవును, కొత్త బంతి స్వింగ్ అవ్వలేదు. రెండు బౌండరీలు ఇచ్చాక ఏ లెంగ్తులో బంతులేయాలో అర్థం చేసుకున్నా. బౌన్సర్లు వేయడమే మంచి ఆప్షన్‌గా భావించా. అందుకే ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్లను మోహరించా. మలన్, హెండ్రిక్స్‌ను ఔట్ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్లాన్ ప్రకారమే వారి వికెట్లు పడగొట్టాం' అని సిరాజ్ తెలిపాడు.
తన లైన్ అండ్ లెంగ్త్ మరింత మెరుగయ్యేందుకు కౌంటీ క్రికెట్ ఉపయోగపడిందని సిరాజ్ అన్నాడు. కొత్త బంతితో వికెట్లు తీయగల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. గాయ పడక ముందు అతడు వార్విక్ షైర్ తరఫున సోమర్‌సెట్‌పై ఆడాడు. 5 వికెట్ల ఘనత అందుకున్నాడు.
'కౌంటీ క్రికెట్‌తో నా లైన్, లెంగ్త్ మెరుగైంది. కొత్త బంతితో వికెట్లు తీస్తానన్న విశ్వాసం పెరిగింది. నా చేతి నుంచి బంతి చక్కగా రిలీజ్ అవుతోంది. బాధ్యతలను నేను ఇష్టపడతాను. నిలకడగా ఒకే లెంగ్తులో బంతులు వేసేందుకు ప్రయత్నిస్తున్నా. రాంచీలోనూ కాస్త రివర్స్ స్వింగ్ లభించింది. హార్డ్ లెంగ్తులో బంతులను ఆడటం బ్యాటర్లకు సులువు కాదు. ఇదే నాకు సాయపడింది' అని ఈ హైదరాబాదీ పేసర్ వెల్లడించాడు.