Team India tour to Pakistan: టీ 20 ప్రపంచకప్‌(T20 World Dup) గెలుచుకుని టీమిండియా(Team India) మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ( Champions Trophy ) 2025పై పడింది. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్‌లో టీమిండియా పాల్గొంటుందా...? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ను పాకిస్థాన్‌ నిర్వహిస్తోంది. భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు అసలు జరగడమే లేదు. ఐసీసీ టోర్నీల్లోనూ తటస్థ వేదికలపైనే దాయాదుల సమరం జరగనుంది. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌..పాకిస్థాన్‌కు వెళ్లడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ఆటగాడు సల్మాన్ భట్‌ (Salman Butt) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను పాక్‌కు తీసుకొచ్చే బాధ్యత ఐసీసీదేనని భట్‌ వ్యాఖ్యాలు చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీపై మాత్రం బీసీసీఐ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 


భట్‌ ఏమన్నాడంటే

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ నిర్వహించే ఈ మెగా టోర్నమెంట్‌ కోసం టీమ్ ఇండియా పాకిస్తాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే దానిపై బీసీసీఐ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై పాకిస్థాన్ మాజీ స్టార్ సల్మాన్ భట్ స్పందించాడు. భారత్‌ను పాకిస్థాన్‌కు తీసుకు రావాల్సిన బాధ్యత ఐసీసీదేనని భట్ అన్నాడు. టీ 20 ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత తమ తదుపరి లక్ష్యం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ అని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే దానిపై మాత్రం జై షా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అన్ని జట్లను పాకిస్థాన్‌కు తీసుకురావడం ఐసీసీ బాధ్యత అని సల్మాన్ భట్ తెలిపాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్థాన్‌ సిద్ధంగా ఉందని... అయితే అన్ని జట్లను తమ దేశానికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం ఐసీసీదేనని  తన యూట్యూబ్ ఛానెల్‌లో భట్‌ అన్నాడు. పాక్‌కు వచ్చేందుకు భారత్‌ సానుకూలంగా ఉందనేలా జై షా వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు అంటున్నారని.. అయితే జై షా ఎలాంటి సానుకూల సిగ్నల్ ఇవ్వలేదని తాను అనుకుంటున్నట్లు భట్‌ తెలిపాడు. జైషా వ్యాఖ్యలతో తాను ఉత్సాహంగా లేనని... ఎందుకంటే అన్ని జట్లు పాకిస్తాన్‌కు వచ్చేలా చూడడం ఐసీసీ బాధ్యతని వివరించాడు. టీమిండియా వస్తే ఘన స్వాగతం పలుకుతామని..రాకపోతే ICC దాని పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు. 





మేం భారత్‌ వచ్చాం కదా

తాము 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చామని భట్‌ గుర్తు చేశాడు. వనన్డే ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించిందని... ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత్‌... పాక్‌లో పర్యటించాలని కోరాడు. అయితే 2023 ఆసియా కప్ కోసం టీమిండియా... పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఆసియా కప్‌లో టీమిండియా తన మ్యాచ్‌లను తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.