Rohit Sharma And His Team: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) గెలిచి కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు బార్బడోస్‌ నుంచి స్వదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. బీసీసీఐ(BCCI) ప్రకటించిన దానిపై ప్రకారం టీమిండియా(Team India) ఆటగాళ్లు బార్బడోస్‌ నుంచి తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. తిరిగి రావడం కాస్త ఆలస్యమైనా భారత ఆటగాళ్లు బార్బడోస్‌(Barbados) నుంచి బయలుదేరారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బార్బడోస్‌లో తుఫాను కాస్త శాంతించడంతో... భారత ఆటగాళ్లు బీసీసీఐ ప్రత్యేక విమానంలో భారత్‌కు పయనమయ్యారు. జూన్‌ 29న టీ 20 ప్రపంచకప్‌ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన నాటి నుంచి భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే చిక్కుకుపోయింది. తుఫాను కారణంగా టీమ్ ఇండియా బార్బడోస్‌లోనే ఉండవలసి వచ్చింది. తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసేయడంతో పాటు బార్బడోస్‌లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది. నిన్న బార్బడోస్‌ నుంచి టీమ్ ఇండియా బయలుదేరాల్సి ఉండగా... తుపాను వల్ల ఆలస్యమైంది. కానీ తుపాను కాస్త విరామం ఇవ్వడంతో భారత జట్టు అక్కడి నుంచి బయల్దేరింది.

  


 





ప్రత్యేక విమానంలో...

బార్బడోస్‌ నుంచి టీమిండియా ఆటగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నిన్న బయలుదేరి.. ఇవాళ సాయంత్రంలోగా భారత ఆటగాళ్లు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే తుపాను వల్ల ఆటగాళ్ల రాక కాస్త ఆలస్యమైంది. టీమ్ ఇండియా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రత్యేక విమానం ఎక్కాల్సి ఉందని... అయితే అది కాస్త ఆలస్యమైందని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. స్వదేశానికి వెళ్లడం కంటే ప్రపంచకప్‌ను గెలవడం సులభమని టీమిండియా ఆటగాళ్లు అనుకుంటూ ఉంటారని కూడా విమల్‌కుమార్‌ జోక్‌ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టీ 20 ప్రపంచకప్‌ భారత్‌కు వచ్చేస్తోందని బీసీసీఐ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో భారత అభిమానులు ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయానికి  టీమిండియా ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉంది. 

 

బార్బడోస్‌లో మరో తుఫాను..

బార్బడోస్‌పై మరో హరికేన్ విరుచుకుపడే అవకాశం ఉందని ప్రధాని  మియా మోట్లీ హెచ్చరించారు. ఇప్పటికే ఒక తుఫానుతో బార్బడోస్‌ అల్లాడుతున్న వేళ... తాజాగా బార్బడోస్‌ ప్రధాని మరో తుఫాను హెచ్చరిక చేశారు. తాము పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని... త్వరలోనే విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని బార్బడోస్ ప్రధాన మంత్రి మియా మోట్లీ  తెలిపారు. విమానాశ్రయ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని  వెల్లడించారు. ఇప్పటికే చాలామంది విదేశీయులు ఇక్కడ రెండు, మూడు రోజులుగా చిక్కుకుపోయారని... వారిని స్వదేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బార్బడోస్‌ ప్రధాని తెలిపారు.